చెన్నైకి మళ్లింపు.. రాత్రి 8 గంటలకు బెంగళూరుకు చేరుకున్న విమానం
ప్రజాశక్తి-తిరుపతి: భారీ వర్షాల కారణంగా ఇండిగో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానానికి శుక్రవారం ప్రతికూల వాతావరణం ఆటంకంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సిన విమానం భారీ వర్షం కారణంగా దిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలెట్ చెన్నైకి మళ్లించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు విమానం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణికులు రేణిగుంట విమానాశ్రయంలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా విమాన ప్రయాణంలో ఏర్పడిన అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనంతరం విమానం రాత్రి 8 గంటలకు బెంగళూరుకు చేరుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నిర్ణీత సమయానికి చేరుకోవాల్సిన విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.







కామెంట్లు (0)