‘‘మీరు పూలన్నింటినీ కోసేయవచ్చు, కానీ వసంత కాలం రాకుండా మాత్రం ఆపలేరు." పాబ్లో నెరుడా రాసిన చిరస్మరణీయమైన పంక్తులివి. మానవాళి, నాగరికతల సమున్నత లక్ష్యం కోసం సాగిపోయే ప్రజలు సామూహిక విజయం సాధించడం అనివార్యమని ప్రకటిస్తున్న అంతిమ వాక్యాలివి. మన గణతంత్ర రాజ్యాంగంలో కీలకాంశమైన ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి-ఓటు హక్కుపై జరిగిన దారుణమైన దాడిని ఎదుర్కోడానికి ప్రారంభమైన ఈ పోరాటం-సమకాలీన భారతదేశంలోనే ప్రజాస్వామ్యం కోసం సాగే అతి గొప్ప పోరాటాలలో ఒకటిగా విస్తరించింది.
భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) గత ఏడాది చేపట్టిన ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర పరిశీలన' (సర్) ప్రక్రియ సామూహికంగా పౌరుల ఓటు హక్కును హరించేదిగా తయారవడం, దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం రావడం యాదృచ్ఛికమేమీ కాదు. పౌరులుగా పరిగణించబడాల్సిన ఎంతో మంది న్యాయమైన ఓటర్ల పేర్లను భారీ ఎత్తున తొలగించడంపై పోరాటం ప్రజాస్వామ్యం పట్ల ప్రజల నిబద్ధతను చాటి చెప్పే సువర్ణాధ్యాయమైంది.
ప్రజాస్వామ్య పోరాటం - హిందూత్వ
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే, అంటే బ్రిటిష్ వలస పాలనపై సాగిన స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ప్రజాస్వామ్యం కోసం పోరాటం ఆరంభమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతా, అపఖ్యాతికరమైన 1975 'ఎమర్జెన్సీ' (అత్యవసర పరిస్థితి) కాలంతో సహా, దేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఒక నయా-ఫాసిస్టు పాలన నీలి నీడల్లో-మన పౌరసత్వం కొలబద్దలనే మార్చేయాలని చూస్తున్న సమయంలో అందుకు వ్యతిరేకంగా సాగుతున్న ఆ పోరాటం బహుశా వాటన్నిటిలోనూ అతి భీకరమైనది కావచ్చు.
పౌరసత్వాన్ని 'హిందుత్వ' ప్రాతిపదికన పునర్నిర్వచించాలని, బహుళ జాతి, బహుళ మత, బహుళ సాంస్కృతిక స్వభావంగల మన ప్రజాస్వామ్యాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టే ఒక మొండి సూత్రం రుద్దాలని ప్రయత్నం సాగుతున్నది. ఇలా చేయడమంటే మన ప్రజాతంత్ర, లౌకిక, సమాఖ్య గణతంత్ర వ్యవస్థ మూలాలను బూటకంగా మార్చడేయమేనన్నది సుస్పష్టం. హిందుత్వ అనే దాంతో ముడిపెట్టేయాలనడం మన 'భిన్నత్వంలో ఏకత్వ' స్వరూపాన్ని కాస్తా మార్చేసి దేశాన్ని మెజారిటీవాదపు సంకుచిత చట్రంలో బంధించే ఒక శ్మశానవాటికగా మార్చేయడానికే దారితీస్తుంది. ఆధునిక దృక్పథంతో, పురోగమన శీలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనే ఆకాంక్ష దిశగా మన ప్రజాస్వామ్య అనుభవం మారుతున్న కాలానికి అనుగుణంగా రూపుదిద్దుకోవాల్సి ఉంది.
అందుకే ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను నిరంతరం సవరించడమనేది మన ఎన్నికల వ్యవస్థను నడిపిస్తూ వస్తోంది. అయితే, ఈసారి ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియతో దాన్నంతటినీ తలకిందులు చేసే ప్రయత్నం జరిగింది. భారీ స్థాయిలో చొరబాట్లు జరుగుతున్నాయనే భయాన్ని సాకుగా చూపి, ‘పౌరులు కాని వారిని’ తొలగించి ప్రక్షాళన చేయాలనే ఒక తతంగం మొదలైంది. ఇదే ఒక మహోత్పాతంగా పరిణమించింది. 13 కోట్ల మందికి పైగా పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్లో 27 లక్షల మంది పౌరులకు ఓటు వేసే అవకాశం నిరాకరించబడిందంటే ఈ ప్రమాదం ఎంత తీవ్రమైందో స్పష్టం చేసింది.
జ్ఞానేశ్ కుట్ర ఛేదిస్తూ...
ఈ క్రమంలో పాల్పడిన అడ్డగోలు పద్ధతులు, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ‘పీపుల్స్ డెమోక్రసీ’ వరుస కథనాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగ పరుస్తూ జ్ఞానేష్ కుమార్ సాగించిన కుట్రను కూడా ఈ కథనాలు ఎండగట్టాయి. ఒక్కసారిగా ఈ అడ్డగోలు వ్యవహారాలు బయటపడగానే అత్యంత తీవ్ర వ్యతిరేకత ప్రజ్వరిల్లింది, ప్రతిఘటన తారాస్థాయికి చేరింది. కేవలం ఓటు హక్కును కాపాడుకోవడానికే గాక భారతదేశ బహుళపక్ష ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించుకోవడానికి జరిగిన పోరాటంగా మారింది. జ్ఞానేష్ కుమార్ దారుణ పోకడలు, అధికార దుర్వినియోగం తీరులో ఒక ఏకపక్ష, చట్టవిరుద్ధ ధోరణి మాత్రమే గాక తెర వెనుక ఏవో రాజకీయ ఆదేశాల మేరకే పని చేశారని స్పష్టమవుతున్నది.
మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జ్ఞానేష్ కుమార్ సాగించిన కుట్రను విజయవంతం చేసేందుకు భారత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించేలా మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ హానికర పరిణామాలను కప్పిపుచ్చడానికి బడా మీడియా చేసిన ప్రయత్నాలు చివరికి బట్టబయలవక తప్పలేదు. గత ఏడాదిన్నర కాలంగా ఈ ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియ అమలులో దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజల ఓటు హక్కుకు వ్యతిరేకంగా సాగిన రోజువారీ కుట్రలు పూర్తిగా బయటపడ్డాయి. మన సమాజంలోని కీలక వర్గాలన్నీ ఈ పోరాటంలో ఏకమవడం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం 'జెన్ జీ’ అంటున్న యువతది ఇందులో చాలా కీలక పాత్ర అయింది. ఇటీవల కాలంలోనే జెన్ జీ విద్యా రంగంలో ఉన్న అవినీతిపై తమ సమిష్టి శక్తిని చాటిచెప్పారు. రాజ్యాంగాన్ని, దానిలోని ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కుల సూత్రాలనూ పరిరక్షించడానికి న్యాయవాద వర్గాలు జీవన్మరణ పోరాటాన్ని చేపట్టాయి. మరోవైపు బడా మీడియా దాదాపు పూర్తిగా బిజెపి-ఆర్ఎస్ఎస్ రాజకీయ నాయకత్వంతో కుమ్మక్కయిన కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా స్వతంత్ర మీడియా, నిజాలను బయటపెట్టడంలో అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించింది. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న మన ప్రస్తుత పోరాటంలో ఇవి కొత్త అంశాలుగా మారాయి.
యువత ముద్రతో ఉద్యమం
యువత తమ తరానికి తగ్గట్టుగా మీమ్స్, కార్టూన్లు, సంగీతం, వ్యంగ్య నాటికలు వంటి మాధ్యమాల ద్వారా ప్రభుత్వ కథనాలను సవాలు చేశారు. 'ఇండియన్ ఎక్స్ప్రెస్' అద్భుతమైన పరిశోధనాత్మక పాత్రికేయం జ్ఞానేష్ కుమార్ను, ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చివరి అస్ర్తంగా పని చేసింది. ఇది పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. అబద్ధపు కథనాలతో ఈ నిరసనలను అడ్డుకోవడం అటుంచి, కనీసం సవాలు చేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. భారీ సన్నాహాలతో అక్టోబరు10న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం భద్రతాదళాలనే గూండాలుగా ప్రయోగించి ఎన్నడూ ఎరగనంత అమానుషకాండకు పాల్పడింది. నిరసనకారుల గొంతు నొక్కేందుకు, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలకు చెందిన వారిని మఫ్టీలోని భద్రతా దళాలతో కలిపి ఇంత పెద్ద ఎత్తున రంగంలోకి దించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఈసారి అధికార యంత్రాంగం అమానుష లక్షణాలలో ఒకటి మహిళా నిరసనకారులు, పాత్రికేయుల పట్ల ప్రదర్శించిన వికృత వైఖరి.
మెట్రో రాకపోకలనూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేయడం, సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడం, నిరసనలో పాల్గొనే వారిని ఇళ్లకే వెళ్లి పోలీసులు హెచ్చరించడం వంటివన్నీ జరిగాయి. శాంతియుత నిరసన హక్కు, అలాగే, రాజ్యాంగంలోని 19వ అధికరణం లోని వాక్, సభా స్వాతంత్ర్యం స్ఫూర్తి పట్ల ప్రస్తుత పాలక వర్గానికి ఏ మాత్రం నమ్మకమే లేదని స్పష్టమవుతున్నది.
అయితే ఇవన్నీ ఎన్ని చేసినా 'ఇండియా' వేదిక ఆధ్వర్యంలో ప్రజలు జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని, ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టుకు భారీగా తరలిరావడంతో ప్రభుత్వ అణచివేత చర్యలన్నీ విఫలమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, వివిధ సంస్థల నుంచి రప్పించిన సుమారు 40,000 మంది భద్రతా సిబ్బంది వున్నా ఆందోళనకారులను అడ్డుకోవడానికి సాహసించని తొలి సందర్భం ఇదే కావచ్చు. రాబోయే మార్పులకు సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మరోవైపు, ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియలోని లోపాలు అత్యంత స్పష్టంగా బయటపడిన పశ్చిమ బెంగాల్లో, గత దశల్లో నమోదు కాని ఓటర్లను చేర్చుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అయినప్పటికీ, ప్రభుత్వం ఇంకా పూర్తిగా వెనక్కి తగ్గినట్టు కనిపించదు. నిరసనలకు ఉద్దేశించిన 'జంతర్ మంతర్' అనుమతి కూడా నిరాకరిస్తోంది.
ేవలం పైపై మార్పులే సరిపోవు. ‘ఎస్.ఐ.ఆర్’ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలి, దురుద్దేశపూర్వక చర్యలన్నీ వెనక్కు తీసుకోవాలి. ఈ మొత్తం తతంగం ప్రారంభించిన వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో ఇది ఒక కీలకమైన ముందంజ అవుతుంది. 'శోధించు, తొలగించు, తరలించు' విధానాన్ని రూపొందించిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి. పూలను తెంచేశారేమో గానీ, వసంత కాలం రావడం తథ్యం అని చాటాలి.
(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం, అక్టోబర్ 14)







కామెంట్లు (0)