శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IDBI: ఇదా దేశభక్తి?

54 నిమిషాల క్రితం

idbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఒకప్పుడు దేశ పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలిచిన సంస్థలను పూర్తిగా విదేశీ కంపెనీలకి అప్పజెప్పడమే కాషాయ పాలకుల విధానంగా ఉంది. తాజాగా ఐడిబిఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు రూ.52,878 కోట్లకు విక్రయించడానికి బుధవారం మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలపడం దారుణం. ఇందులో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసి 30.24 శాతం వాటాను అమ్ముతున్నాయి. మిగిలిన 15 శాతాన్ని తర్వాత బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు ఆర్థిక మంత్రి నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక లావాదేవీ కాదు. ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థ ప్రైవేటీకరణ వైపు మారుతున్న తరుణం. ఈ అమ్మకాన్ని రద్దు చేయాలన్న ఉద్యోగులు, కార్మిక సంఘాల డిమాండ్ సబబైనది.

​ 1964లో ఆర్‌బిఐ అనుబంధ సంస్థగా మొదలైన ఐడిబిఐని 1976లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలిచ్చే ప్రధాన ఆర్థిక సంస్థగా తీర్చిదిద్దింది. సెబీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎగ్జిమ్ బ్యాంక్, ఎస్‌ఐడిబిఐ వంటి కీలక సంస్థల ఏర్పాటులో ఇది తోడ్పడింది. నయా ఉదారవాద విధానాల్లో భాగంగా 2003లో దీన్ని కంపెనీగా, 2004-05లో వాణిజ్య బ్యాంకుగా మార్చారు. బ్యాంకుగా మారాక కూడా పాత పారిశ్రామిక రుణ విధానాన్నే కొనసాగించింది. 2018 మార్చి నాటికి నిరర్థక ఆస్తులు రూ.55,588 కోట్లకు, అంటే మొత్తం రుణాల్లో సుమారు 28 శాతానికి చేరి దేశంలోనే అత్యధిక స్థాయిలో నిలిచాయి. అప్పుడు ఎల్ఐసి రూ.9,300 కోట్లతో ఆదుకుంది. 2019 జనవరి నాటికి రూ.21,624 కోట్ల పెట్టుబడితో 51 శాతం నియంత్రణ వాటాను తీసుకుంది. అంటే ఈ బ్యాంకును నిలబెట్టింది కోట్లాది మంది ఎల్ఐసి పాలసీదారుల సొమ్మే. ఇప్పుడు బ్యాంకు గణనీయంగా కోలుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 31.8 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గాయి. మూలధన సమృద్ధి నిష్పత్తి 6.2 శాతం నుంచి దాదాపు 27 శాతానికి పెరిగింది. గత దశాబ్దంలో ప్రభుత్వ బ్యాంకులకు రూ.3 లక్షల కోట్లకు పైగా మూలధనం అందింది, భారీగా రుణాల రద్దు జరిగింది. అందుకే ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.98 లక్షల కోట్ల లాభం ప్రకటించడాన్ని, ఐడిబిఐ అమ్మకాన్ని ఒకే విధానానికి రెండు ముఖాలుగా చూడాల్సి వస్తోంది. నష్టాలను ప్రజలు భరించి, బాగుపడిన తర్వాత ఆ సంస్థను ప్రైవేటుకు, అదీ విదేశీ కంపెనీకి అప్పగించడం దేశద్రోహం కాదా అన్నది ప్రజల ప్రశ్న.

​ ధర విషయంలోనూ స్పష్టత లేదు. ఫెయిర్‌ఫాక్స్ చెల్లించేది బ్యాంకు లాభానికి సుమారు తొమ్మిది రెట్లు, మూల విలువ కంటే 23 శాతం అధికమని చెబుతున్నా ఇది మార్కెట్ ధర కంటే తక్కువ. ప్రభుత్వం, ఎల్ఐసి చేతుల్లోనే 94.72 శాతం వాటా ఉండటంతో మార్కెట్ ధర వాస్తవ విలువను చూపదన్నది ప్రభుత్వ వాదన. అయితే బ్యాంకు నికర ఆస్తులు రూ.4.67 లక్షల కోట్లు ఉండగా, కేవలం రూ.52,878 కోట్లకు అమ్మడం నామమాత్రపు ధరేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్వతంత్ర మదింపు నివేదికలను ప్రభుత్వం బహిరంగపరచనందున ఈ ఆరోపణ నిజమని భావించవచ్చు. ఇది ప్రజల ఆస్తిని, సుమారు 18 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో వేస్తుంది. వారి ఉద్యోగ భద్రత, సేవా షరతులపై స్పష్టమైన హామీ లేదు. ఇది ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ. 2017-18లో హెచ్‌పిసిఎల్ వాటా అమ్మకం (రూ.36,915 కోట్లు), 2022లో ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించడం (రూ.18,000 కోట్లు) కంటే ఇది పెద్దది. ఈ నిధులతో బడ్జెట్‌లో నిర్దేశించిన రూ.80,000 కోట్ల లక్ష్యం దాటిపోనుంది. బడ్జెట్ పత్రాల్లో ‘పెట్టుబడుల ఉపసంహరణ’ పదాన్ని తొలగించి ‘ఇతర మూలధన రాబడులు’ అని మార్చడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఈ అమ్మకాన్ని ఉపసంహరణగా పరిగణించకూడదని, కేవలం ‘పునర్వ్యవస్థీకరణ’ అని ఆర్థిక మంత్రి చెప్పడం కూడా అలాంటిదే. ఇప్పటివరకు ఎల్ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉండగా, ఇకపై అవి 19, 15 శాతాలకు పడిపోతాయి. బోర్డులో ప్రాతినిధ్యం కూడా ఉండదన్న వాదన నిజమైతే, నియంత్రణను పూర్తిగా వదులుకున్నట్టే. మరి దీన్ని ‘పునర్వ్యవస్థీకరణ’ అనడం ప్రజలను మభ్యపెట్టడమే.

​ ఇది మొదటి నిర్ణయం కాదు. ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బిఎల్ బ్యాంకులో ఎమిరేట్స్ ఎన్‌బిడి సుమారు 3 బిలియన్ డాలర్లకు 60 శాతం వాటా తీసుకుంది. కొన్ని రోజుల ముందు శ్రీరామ్ ఫైనాన్స్‌లో జపాన్‌కు చెందిన ఎంయుఎఫ్‌జి 20 శాతం వాటాను 4.4 బిలియన్ డాలర్లకు కొన్నది. గత ఏడాది యస్ బ్యాంకులో మరో జపాన్ సంస్థ ఎస్‌ఎంబిసి 24.2 శాతం వాటాను సుమారు 2 బిలియన్ డాలర్లకు తీసుకుంది. దేశ ఆర్థిక నాడి క్రమంగా విదేశీ చేతుల్లోకి జారిపోతోంది. ఓటు హక్కు పరిరక్షణ, రాజ్యాంగబద్ధ పాలన పునరుద్ధరణ కోసం విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులు ఆందోళనలు చేస్తున్న వేళ, ప్రభుత్వం ప్రజల ఆస్తులను అమ్మే పనిలో నిమగ్నమవడం ఆందోళనకరం.

అభివృద్ధి లక్ష్యంతో పుట్టిన సంస్థ పాలకుల కార్పొరేట్ విధానాలతో దారి తప్పి సంక్షోభంలో పడితే, ప్రజాధనమే దాన్ని ఆదుకుంది. ఇప్పుడు సంస్కరణల పేరుతో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దాని ఉనికికి ముప్పు ఏర్పడింది. ఈ అమ్మకాన్ని రద్దు చేయాలన్న ఉద్యోగులు, కార్మిక సంఘాల డిమాండ్‌కు ప్రజలు, ప్రగతిశీల శక్తులు మద్దతివ్వాలి. జాతి సంపదను కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్