- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బి.తులసీదాస్
ప్రజాశక్తి - శ్రీకాకుళం : సముద్ర తీర ప్రాంతాన్ని రేర్ ఎర్తు మినరల్స్ కోసం టిడిపి కూటమి ప్రభుత్వం ఆదానికి కట్టబెట్టడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో గార్నైట్, ఎలిమినైట్, జిర్కాన్ టైటానియం మొదలగు రేర్ఎర్త్ మేనరల్స్ కోసం తీరప్రాంతాన్ని తవ్వకాలు జరగడం వల్ల శ్రీకాకుళం జిల్లాకు పెను ప్రమాదం ఏర్పడుతుందని ఆయన విమర్శించారు తీర ప్రాంతం తవ్వకాలు జరిపి పలు రకాల ఇసుకను తరలించికెళ్ళిపోవడం వలన ఆదానికి వేల కోట్ల ఆదాయం వస్తుందని శ్రీకాకుళం జిల్లాకు పెనుముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో వేటమీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు జీవితాలు చిన్నాభిన్నమవుతాయని , మత్స్యకార గ్రామాలకు అక్కడ నివసిస్తున్న ప్రజలకు పెనుముప్పు ఏర్పడుతుందని అన్నారు. తీర ప్రాంతం తవ్వకాలు వలన ఉప్పునీరు పంట పొలాల్లోకి వస్తుందని దీనివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు అదేవిధంగా సునామీలు, తుఫాన్లు వచ్చేటప్పుడు లూజ్ సోయిల్ వలన సముద్రం ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని దీనివల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని విమర్శించారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడి కోసం గొప్పలు చెపుతున్నారు తప్ప ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరప్రాంతాన్ని ఆదానికి కట్టబెట్టడాన్ని వెంటనే ఉపసహరించుకోవాలని లేకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు భూములను బలవంతంగా గుంజుకుంటున్నదని విమర్శించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాల నిర్మాణం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంత భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా జిల్లా కేంద్ర రిమ్స్ హాస్పిటల్ లో కనీస వైద్య సదుపాయాలు లేక పేషెంట్లను విశాఖ తరలించే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక విభాగాల్లో వైద్యులు లేరని వైద్య సిబ్బందిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిమ్స్ హాస్పిటల్ కు ఎందుకు నిధులు కేటాయించడం లేదని కేంద్రమంత్రి కింజరాపు. రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీగా హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్న ఎన్నికల హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.2 సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆఫ్ షోర్ రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడీకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని రిమ్స్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేయాలని, నాగావళి నది జల కాలుష్యం నివారించాలని ఉద్యమాలు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు గంగరాపు.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)