ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఖజానాకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆశించిన ఆదాయం రాక భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆదాయలోటు, ద్రవ్యలోటు కూడా భారీగా పెరుగుతోంది. కాగ్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఆర్థిక సంవత్సరపు తొలి మూడు నెలల కాలంలో వార్షిక ఆదాయ లక్ష్యంలో కేవలం 16.87% ఆదాయం మాత్రమే సమకూరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ. 2.34 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దీని ప్రకారం ప్రతి మూడు నెలలకు 58,500 కోట్ల రూపాయలు రావాల్సిఉంది. అయితే,ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొలి త్రైమాసికంలో కేవలం రు.39,500 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది.
జిఎస్టి ద్వారా ప్రతి మూడు నెలలకు 15,670 కోట్ల రూపాయలు రావాల్సిఉండగా రూ.13,500 కోట్లు వచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మూడు నెలలకు 4,675 కోట్లు వస్తుందని అంచనా వేయగా, 390 కోట్ల రూపాయలు, అమ్మకపు పన్ను ద్వారా మూడు నెలల్లో 6,031 కోట్ల రూపాయలు వస్తాయని భావించగా 5,179 కోట్ల రూపాయలు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ డ్యూటీ కూడా లక్ష్యాల మేరకు వసూలు కాకపోవడం గమనార్హం. మూడు నెలలకు 7,516.50 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం వస్తుందని అంచనా వేయగా తొలి మూడు నెలల కాలంలో 5,149 కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి.
కేంద్రం నుంచి మళ్లీ కోతలే...
ఈ త్రైమాసికంలో కూడా కేంద్రం నుంచి రావలసిన నిధుల్లో భారీగానే కోతలు పడ్డాయి. రాష్ట్రంలో అమలు చేసే వివిధ పథకాలకు కేంద్రం నుంచి రూ. 32,458 కోట్లు వస్తాయని అంచనా వేయగా కేవలం 6.82 శాతంతో రూ.2,215 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రు. 46,759 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 7,332 రాష్ట్రానికి చేరుకున్నాయి.
భారీగా అప్పులు
ఆదాయం కన్నా ఖర్చులు పెరిగిపోవడంతో ఈసారి కూడా అప్పుల పైనే ఆధారప డాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మొత్తానికి రూ.75,868 కోట్లు రుణంగా సేకరించాలని నిర్ణయించుకోగా కేవలం మూడు నెలల్లోనే రూ.33,623 కోట్లు అప్పులు చేయాల్సి వచ్చింది. ఇది ఏడాది మొత్తం అంచనాలో ఏకంగా 44.30% కావడం ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న లోటు
ఆదాయం తగ్గి, వ్యయం పెరుగుతుండటంతో ఆ ప్రభావం ద్రవ్యలోటుపై కూడా పడుతోంది. తాజా నివేదిక మేరకు ఈ ఏడాది రూ.22 వేల కోట్లు ఆదాయలోటుగా ఉంటుందని అంచనా వేయగా ఇప్పటికే అంచనాలు దాటి రూ. 23,663 కోట్లకు లోటు చేరింది. ఇది 107%కావడం గమనార్హం. ఇక ద్రవ్యలోటు పరిస్థితి కూడా ఇదేవిధంగా కనిపిస్తోంది. ఏడాది మొత్తానికి రూ.75,868 కోట్లు లోటుగా ఉంటుందని అంచనా వేయగా తొలి మూడు నెలల్లోనే దాదాపు 44 శాతంతో రూ.33,613 కోట్లకు ద్రవ్యలోటు చేరిపోయింది.







కామెంట్‌లు (0)