• రాష్ట్రంలో 4.9 శాతానికి ఎగబాకిన వైనం
• గ్రామీణ ప్రాంతాల్లో 6.91 శాతం
• ముఖ్యమంత్రి సమీక్షలో ఆర్థికశాఖ నివేదన
• అదుపునకు చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశం
ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : రాష్ట్రంలో ద్రవ్బోలణం పెను సవాలుగా మారిందని, గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆర్థిఖ శాఖ అధికారులు నివేదించారు. ఈ ఏడాది మే నాటికి రాష్ట్ర ద్రవ్యోల్బణం 4.9 శాతానికి ఎగబాకినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 6.91 శాతానికి చేరుకుందన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రవ్యోల్బణం తగ్గింపునకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పియూష్ కుమార్ నివేదిక సమర్పించారు. వృద్ధి, జిఎస్‌డిపి (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వంటి అంశాలను వివరించారు. 2025-26లో ఆంధ్రప్రదేశ్ 9.9 శాతం వృద్ధి నమోదు చేసి.. జాతీయ సగటు 7.4 శాతాన్ని అధిగమించిందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో రాష్ట్రాన్ని అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర జిఎస్‌డిపిని రూ.3.08 కోట్ల కోట్లకు, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు పెంచేందుకు, ఏటా 15 శాతం కంటే అధిక ఆర్థిక వృద్ధి సాధించే దిశగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. ఈ లక్ష్యాల అమలును పర్యవేక్షించేందుకు 30 సచివాలయ శాఖలు, 87 విభాగాల పరిధిలో 651 కీలక పనితీరు సూచికలు రూపొందించి డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 39.8 శాతం పెరిగి 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరడం, తోట పంటలు, పశుసంవర్ధక, ఆక్వా రంగాలు పురోగతి సాధించడం సానుకూల పరిణామాలని పేర్కొన్నారు. అయితే నూనె గింజలు, మిర్చి, పసుపు, ఇన్‌లాండ్ చేపల ఉత్పత్తిలో తగ్గుదలపై ప్రత్యేక దృష్టి అవసరమని చెప్పారు. పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 10.9 శాతం పెరిగిందని, కొత్త ఫ్యాక్టరీల నమోదు 31.6 శాతం పెరిగిందని వివరించారు. అయితే తయారీ రంగం 4.7 శాతం క్షీణించడం ప్రధాన సవాలుగా ఉందన్నారు. సేవా రంగంలో జిఎస్‌టి వసూళ్లు 21.3 శాతం, ఐటి ఎగుమతులు 32.2 శాతం, వాణిజ్య వాహనాల నమోదులు 51.6 శాతం, దేశీయ పర్యాటకుల రాక 22 శాతం పెరగడం ఆర్థిక కార్యకలాపాల బలోపేతానికి సూచికగా భావిస్తున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్, ప్రజా విత్త రంగాల్లో బ్యాంకు రుణాలు 137.6 శాతం, రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 18.2 శాతం పెరిగాయని తెలిపారు. అయితే మూలధన వ్యయం 33.1 శాతం తగ్గి కేవలం రూ.2,547 కోట్లకు పరిమితం కావడం ఆందోళనకరమని వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం చేసేందుకు దీనిపై ప్రత్యేక దృష్టి అవసరమని సూచించారు. మూలధన వ్యయాన్ని పెంచడం, తయారీ రంగాన్ని పునరుద్ధరించడం, పారిశ్రామిక ప్రాజెక్టులను వేగంగా గ్రౌండింగ్ చేయడం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పెట్టుబడులు, ఉపాధి కల్పనను వేగవంతం చేయడం ద్వారానే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించగలమని పియూష్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఈ అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వివిధ శాఖల అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.







కామెంట్‌లు (0)