మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిజెపికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి..

2 గంటల క్రితం

ma babay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 12:04 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • భిన్నాభిప్రాయాల‌ను ప‌క్క‌నపెట్టి బిజెపిని ఓడించ‌డ‌మే ప్ర‌తిప‌క్ష పార్టీల ప్రాధాన్య‌త‌

  • 20న సిజెపి ఆందోళనలో సిపిఎం ఎంపీలు

  • మీడియాతో ఎంఎ బేబీ

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో బిజెపికి వ్య‌తిరేకంగా లౌకిక‌, ప్ర‌జాస్వామ్య రాజ‌కీయ శ‌క్తుల‌న్నీ ఏకం కావాల‌ని సిపిఎం ప్ర‌ధాన కార్య‌దర్శి ఎంఎ బేబీ పిలుపునిచ్చారు. భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి బిజెపిని ఓడించడమే ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త కావాల‌ని సూచించారు. పార్టీ కేంద్ర కమిటీ సమావేశం అనంతరం మంగ‌ళ‌వారం సిపిఎం కేంద్ర కార్యాల‌యం (ఎకె గోపాల‌న్ భ‌వ‌న్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిన‌వే. దేశ వ్యాప్తంగా బిజెపి ఎలా విస్తరిస్తోందో వివిధ రాష్ట్రాల ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. బిజెపి ప్ర‌మాదాన్ని, ఫాసిస్టు ఆర్ఎస్ఎస్‌ను ఎదుర్కొనడానికి, దాన్ని ఓడించ‌డానికి దేశంలోని అన్ని లౌకిక‌, ప్ర‌జాస్వామ్య రాజ‌కీయ‌ శ‌క్తుల‌న్నీ ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీల మ‌ధ్య భిన్నాభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టి, బిజెపి, ఆర్ఎస్ఎస్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డానికి ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్రాధాన్య‌త ఇవ్వాలి. ఇది ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప్ర‌తి రాజ‌కీయ పార్టీ బాధ్య‌త. కానీ కొన్ని రాజ‌కీయ పార్టీలు ముఖ్య‌మైన ఈ ప‌ని వ‌దిలి. త‌మ రాజ‌కీయ అంశాల‌ను ముందుకు తీసుకువ‌స్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం కేర‌ళ వ‌చ్చి సిపిఎం నేత‌ల‌ పట్ల అగౌర‌వంగా మాట్లాడారు. అయిన‌ప్ప‌టికీ మా ప్ర‌ధ‌మ ప్రాధాన్య‌త బిజెపిని ఓడించ‌డ‌మే పెట్టుకున్నాం. అందుకే ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.

సిజెపి ఆధ్వ‌ర్యంలో ఈనెల 20న నిర్వహించనున్న పార్ల‌మెంట్ మార్చ్‌లో సిపిఎం ఎంపిలు భాగ‌స్వామ్యం అవుతార‌ని, విద్యార్థి సంఘాలు భాగ‌స్వామ్యం అవుతాయ‌ని తెలిపారు. సిజెపి ఆందోళ‌న గురించి పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్త‌డానికి ఎంపిలు చ‌ర్చిస్తార‌ని అన్నారు. విజింజం పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంఎస్‌సి కంపెనీకి విక్రయించాలని నిర్ణయించడాన్ని వ్య‌తిరేకిస్తున్నా మ‌ని అన్నారు. మల్టీనేషనల్ కంపెనీల చేతికి ప్రాజెక్టును అప్పగించే ఎలాంటి చర్యలనైనా వ్య‌తిరేకిస్తామ‌ని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత పిన‌ర‌యి విజ‌య‌న్, సిపిఎం రాష్ట్ర నాయ‌క‌త్వం దీనిపై స్పందించార‌ని పేర్కొన్నారు. విడి స‌తీసన్ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని, కానీ మీడియాలో ఏదేదో రాస్తున్నార‌ని తెలిపారు.

కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీ చిత్తశుద్ధితో కూడిన దిద్దుబాటు చర్యలు చేపడుతుందని చెప్పారు. ‘‘సిపిఎం కేంద్ర కమిటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా సమీక్షించింది. ఎన్నికల అంశాలను లేవనెత్తడంలో, ప్రచారాలు నిర్వహించడంలో, అభ్యర్థులను ఎంపిక చేయడంలో లోపాలు, బలహీనతలు ఉన్నాయని కేంద్ర కమిటీ సమావేశం అంచనా వేసింది. వాటన్నింటినీ అధిగమించడానికి పార్టీ చిత్తశుద్ధితో కూడిన దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. ఆగస్టు చివరిలో పశ్చిమ బెంగాల్‌లో, సెప్టెంబర్ రెండో వారంలో కేరళలో జరగనున్న విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ విషయమై స్పష్టమైన చర్యలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్‌) కేవలం ప్రజల కోసమే నిలబడే ఉద్యమమని, ప్రజలను ఒప్పించడంలో విఫలమవడమే ఎన్నికల ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి నుంచి శాఖా సభ్యుల వరకు అందరి కార్యకలాపాల్లో చిన్న, పెద్ద లోపాలు ఉన్నాయని, అవే వైఫల్యాలు అందరిలోనూ లేవని ఆయన అన్నారు. ‘మనం చేసిన తప్పు ఏమిటి?’ అని అన్ని స్థాయిల కార్యకర్తలు తమను తాము సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ‘‘ఈ పార్టీలో ఆత్మవిమర్శకు అతీతులు ఎవరూ లేరు. అన్ని స్థాయిలలోని పార్టీ నాయకుల ప్రవర్తనలో కొన్ని తప్పులు, లోపాలు ఉన్నాయన్నది వాస్తవం. వాటిని సరిదిద్దుకోవాలని కేంద్ర కమిటీ ఆమోదించిన పత్రంలో ఉంది. ఆ సూచన మీడియా లక్ష్యంగా చేసుకున్న ఏ నాయకుడినీ ఉద్దేశించినది కాదు. బదులుగా, అన్ని స్థాయిలలోని పార్టీ నాయకులు ప్రజల పట్ల పాటించాల్సిన ప్రవర్తనపై అది ఒక అంచనా. ప్రజలు చెప్పేది వినడానికి ఓపిక ఉండాలి. వారు చెప్పేదంతా విన్న తరువాత ఓపికగా స్పందించే ప్రజాస్వామ్య మర్యాద ఉండాలి. కొన్ని సందర్భాల్లో, నాతో సహా పలువురు అలాంటి విషయాల్లో తప్పులు చేసి ఉండవచ్చు. ఆ తప్పులు, లోపాలు పునరావృతం కాకుండా పార్టీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కమిటీ పత్రంలో పేర్కొంది’’ అని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్