సుప్రీంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంప్లీడ్‌కు ఆదేశాలివ్వండి
జాతీయ ఎస్‌టి కమిషన్ సభ్యులు ఆశలక్రాకి గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘాల నేతల వినతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 1/70 చట్టం పరిరక్షణ కోసం సుప్రీం కోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసేవిదంగా ఆదేశాలివ్వాలని జాతీయ ఎస్‌టి కమిషన్ సభ్యులు ఆశ లక్రాకి గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడిక్కడ లోక్ భవన్‌లో ఆశలక్రాని సిపిఎం రాజ్యసభ ఎంపి వి.శివదాసన్, ఆదివాసీ గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పి.సచిన్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివదాసన్ మాట్లాడుతూ 1/70 చట్టం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజనుల భూములు, అడవులు, సహజ వనరులను రక్షించే గుండెకాయలాంటి చట్టమని పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని బలహీనపరిచే కుట్రలను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కావాలని డిమాండ్ చేశారు. బి. వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 60 లక్షల మంది ఆదివాసీల భూమి హక్కులకు 1/70 చట్టమే ప్రధాన రక్షణ కవచమని అన్నారు. 2023 నుండి కొందరు గిరిజనేతరులు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేసినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని అన్నారు.
కిల్లో సురేంద్ర, సచిన్ మాట్లాడుతూ 1/70 చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులు (డైరీ నంబర్లు 394/2023, 1752/2026)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇంప్లీడ్ అవుతూ చట్టాన్ని సమర్థించే పిటిషన్ దాఖలు చేయాలని అన్నారు. ఈ పిటిషన్లను కొట్టివేసేలా సమర్థవంతమైన న్యాయపర మైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ రక్షణలో ఉన్న 1/70 చట్టం గిరిజనుల భూమి హక్కులను, రాజ్యాంగబద్ధమైన రక్షణలను కాపాడే అత్యంత కీలకమైన చట్టమని, దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ అనుమతించరాదని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్‌కు నివేదించామన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషన్ సభ్యురాలు ఆశా లక్రా, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో తగిన చర్యలు తీసుకునేలా అవసరమైన జోక్యం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎడబ్ల్యుయు జాతీయ నాయకులు సాహెల్ కూడా పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)