మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజాతీయ ఆహార భద్రతా చట్టానికి సవరణలు ఉపసంహరించాలి

2 గంటల క్రితం

CPM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 12:18 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం

  • ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా ప్రచారం

  • మైనారిటీలపై దాడులకు ఖండన

  • పౌరసత్వాన్ని పునర్నిర్వచించే చర్యలకు ఖండన

  • ఎన్నికల సంస్కరణలకై ప్రచారోద్యమం

  • విస్తృత స్థాయిలో సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారం

  • మహిళలు, రైతు సంఘాలు, విద్యార్ధుల నిరసనల పిలుపులకు మద్దతు

  • సిపిఎం కేంద్ర కమిటీ ప్రకటన

న్యూఢిల్లీ : జాతీయ ఆహార భద్రతా చట్టానికి చేయతలపెట్టిన సవరణలను ఉపసంహరించు కోవాలని, అలాగే రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసులో బాధ్యులైనవారు ఏ స్థాయిలో వున్నా వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ కోరింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) కేంద్ర కమిటీ ఈ నెల 11-13 తేదీల్లో ఇక్కడ సమావేశమై ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది.

మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ వారికి ఓటు హక్కును తొలగించేందుకు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను, తీసుకుంటున్న చర్యలను సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జరిపిన సమీక్ష సందర్భంగా గుర్తించిన లోపాలు, లొసుగులు, బలహీనతలను అధిగమించేందుకు గానూ దిద్దుబాటు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. జులై 20న సిజెపి ఇచ్చిన పార్లమెంట్‌ ‌మార్చ్‌‌కు , ఆగస్టు 10న కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్‌‌కెఎం ఇచ్చిన జైల్‌ ‌భరో పిలుపులకు మద్దతునిచ్చింది. మహిళా రిజర్వేషన్‌ అమలు కోసం మహిళా సంఘాలు ఇచ్చిన నిరసనల పిలుపునకు కూడా సమావేశం మద్దతునిచ్చింది. ఎన్నికల సంస్కరణలకోసం ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించింది. రైతులకు ఎరువులు, ప్రధానంగా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దానికి విరుద్ధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత రిజర్వ్‌ ‌బ్యాంక్‌ (ఆర్‌‌బిఐ) జూన్‌‌లో విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం, 2026-27 సంవత్సరానికి వాస్తవిక జిడిపి వృద్ధి రేటును 6.6శాతంగా అంచనా వేశారు. 2025-26లో అంచనా వేసిన 7.7శాతం నుండి ఈ వృద్ధిరేటు తగ్గింది. జూన్‌ ‌మాసంలో ప్రైవేటు రంగ వృద్ధి మూడు మాసాల కనిష్టానికి పడిపోయిందని పిఎంఐ డేటా తెలియచేస్తోంది. వర్షాభావ పరిస్థితులు మరింతగా ఈ అభివృద్ధి రేటును, ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయగలవని ఆర్‌‌బిఐ కూడా పేర్కొంది.

ఎరువుల కొరత వుందని ప్రధానంగా యూరియా సంక్షోభం నెలకొందంటూ వివిధ రాష్ట్రాల్లో రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య ఉధృతంగానే కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఏ మాత్రమూ సున్నితత్వం లేని బిజెపి ప్రభుత్వం ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయాలని ప్రతిపాదిస్తోంది.

ఆహార భద్రతా చట్టానికి సవరణ : జాతీయ ఆహార భద్రతా చట్టానికి (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) చేయతలపెట్టిన సవరణలు అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కింద అర్హతా ప్రమాణాలను కుటుంబ ప్రాతిపదిక వ్యవస్థ నుండి సగటు తలసరి వ్యవస్థకు మారుస్తున్నాయి. ఈ పరిస్థితి, రాష్ట్రాలను ముఖ్యంగా కుటుంబ నియంత్రణా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన, ఫలితంగా సగటు చిన్న కుటుంబాలను కలిగివున్న దక్షిణాది రాష్ట్రాలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. లబ్దిదారుల డేటాబేస్‌‌ను ఆధునీకరించి, ప్రస్తుత జనాభాకు తగినట్లుగా వర్తింపును కూడా విస్తరించాలంటూ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌‌ను పరిష్కరించడానికి బదులుగా సమాజంలోని నిరుపేద వర్గాల ఆహార హక్కులను తీవ్రంగా కుదించేలా సవరణను ప్రవేశపెట్టాలని బిజెపి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రచారం చేపడుతుంది. తన ప్రతిపాదనతోనే ప్రభుత్వం ముందుకు సాగినట్లైతే తలెత్తే నిరసనలకు సిపిఎం నేతృత్వం వహిస్తుంది.

జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిషన్‌ : జనాభా శాస్త్ర నిపుణుడు ఒక్కరు కూడా లేకుండానే జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిషన్‌‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘బంగ్లాదేశ్‌ ‌నుండి వచ్చిన ముస్లిం శరణార్ధులను’ గుర్తించడమనే బాధ్యతను పరోక్షంగా ఈ కమిషన్‌‌కు అప్పగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాకు శాస్త్రీయ ముసుగు వేయడమే దీని ఉద్దేశ్యం. ఎన్‌ఆర్‌‌సి, సిఎఎలకు అనుగుణంగా ఈ కమిషన్‌ , ఎన్నికల ప్రయోజనాల కోసం మత విద్వేషాలను, సామాజిక విభజనలను రెచ్చగొట్టే, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని అణచివేయడాన్ని వ్యవస్థీకృతం చేసే సాధనంగా వుంది. రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే దీన్ని ప్రకటించారు. ఈ చర్య సమాఖ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోంది.

గుజరాత్‌‌లో మతపరమైన వర్గీకరణ: మైనారిటీలను మత ప్రాతిపదికన గుర్తించి, వారిని లక్ష్యంగా చేసుకునేందుకు గుజరాత్‌ ‌రాష్ట్ర పోలీసులు కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ‌ప్రొసీజర్‌ (ఎస్‌ఓపి)ను అమలు చేస్తున్నారు. తమ వేషధారణ, రూపం కారణంగా అనుమానాస్పదంగా భావించిన మైనారిటీలపై అక్రమంగా నిఘా పెట్టేందుకు ఈ పద్ధతి అనుమతిస్తోంది. అసమ్మతి వ్యక్తంచేసే వారందరినీ ఈ నిఘా కింద పెడుతున్నారు. ముస్లిం మెజారిటీ దేశాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై వారు అసమ్మతి వ్యక్తం చేసినా ఈ నిఘా నీడన చేరక తప్పడం లేదు. పైగా ఉపా, ఎన్‌‌ఎస్‌ఎ వంటి కఠినమైన చట్టాలు, బిఎన్‌ఎస్‌‌లోని ఇతర నిబంధనలు వారిపై మోపుతామనే బెదిరింపులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ చర్యలన్నీ కూడా రాజ్యాంగంలో హామీ కల్పించిన ప్రాధమిక హక్కులను, గోప్యతా హక్కును ఉల్లంఘిస్తున్నాయి. పైగా సుప్రీం కోర్టు ఈ హక్కులన్నిటినీ ఉల్లంఘించలేనివిగా కూడా పేర్కొంది. ఈ చర్యలన్నీ కూడా అన్ని రూపాల్లోని అసమ్మతిని అణచివేసేందుకు, సమాజాన్ని మరింత చీల్చేందుకు ఉద్దేశించబడ్డాయి. పౌరులను మతాల పరంగా వర్గీకరించడం, వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉల్లంఘించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోంది.

బెంగాల్‌‌లో బిజెపి ప్రభుత్వ నిరంకుశ పార్శ్వం : అధికారంలోకి వచ్చిన రెండు మాసాల్లోనే, బెంగాల్‌‌లో బిజెపి ప్రభుత్వ నిరంకుశవాద పార్వ్వం బహిర్గతమైంది. ఇటీవల మైనర్‌ ‌బాలికపై అత్యాచారం, ఆ సంఘటనలోని నిందితులను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే మహిళల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరి, మనువాదీ స్వభావం బట్టబయలవుతోంది. పైగా ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియలో పేర్లు తొలగించబడిన వారికి సంక్షేమ పథకాలు వర్తించడానికి అనుమతించబోమంటూ ప్రభుత్వం ప్రకటించింది. హాకర్లను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని నిరసిస్తున్న వారిపై పోలీసులు పాశవికంగా వ్యవహరించారు. పలు జిల్లాల్లో సిపిఎం కార్యాలయాలపై బిజెపి కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. పార్టీ పతాకాలను తగలబెడుతున్నారు. అటువంటి దాడులతో సిపిఎంను బెదిరించలేరు. బిజెపి నిరంకుశ, మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడాన్ని, ప్రతిఘటించడాన్ని సిపిఎం కొనసాగిస్తూనే వుంటుంది.

అస్సాం ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ ‌శర్మ బాధ్యతారాహిత్యమైన ప్రకటనలను సిపిఎం కేంద్ర కమిటీ ఖండిస్తోంది. జుబీన్‌ ‌గార్గ్‌ ‌వంటి ప్రగతిశీల సాంస్కృతిక ప్రముఖుల చిత్రాలను ఫ్లై ఓవర్లపై గీస్తున్న వారిపై ఎన్‌ఎస్‌ఎ నిబంధనలు మోపుతామని బెదిరిస్తూ ఆయన చేసిన ప్రకటనలు ఖండించాల్సినవి. ఆయన ప్రకటనలు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఎజెండా ఏ మాత్రమూ సహించరానిది, మైనారిటీలను, వామపక్షాల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ మరోపక్క తన విచ్ఛిన్నకరమైన, మతోన్మాద ఎజండాను ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తీసుకెళుతోంది.

కేరళంలో కార్పొరేట్‌ అనుకూల కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం : కేరళం ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే మెతక హిందూత్వవాద వైఖరి, కాంగ్రెస్‌ లొంగుబాటు ధోరణి పూర్తి స్థాయిలో ప్రదర్శితమవుతున్నాయి. గత ఎల్‌‌డిఎఫ్‌ ‌ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ చర్యలను ప్రస్తుత ప్రభుత్వం నీరు గార్చేందుకు సిపిఎం ఎంతమాత్రమూ అనుమతించదు. తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రజలను సమీకరిస్తుంది.

అమెరికా-ఇరాన్‌ ఎంఓయు : ఇరాన్‌, అమెరికా మధ్య సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందం (ఎంఓయు) బలహీనతలను కేంద్ర కమిటీ గుర్తించింది. ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ ‌దాడులు కొనసాగిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ పరిమితులను ఈ అవగాహనా ఒప్పందం ప్రదర్శిస్తోంది. తన దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాల కారణంగానే అమెరికా, ఈ అవగాహనా ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కూడా క్షీణించాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే ఈ ధరలను తగ్గించాలి. రైతులకు ఎరువులు ముఖ్యంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర కమిటీ కూలంకషంగా, సమగ్రంగా సమీక్షించింది. ప్రచారం జరిగిన తీరులో, సమస్యలను ఎత్తిచూపడంలో, అభ్యర్ధుల ఎంపికలో కొన్ని లోపాలు, బలహీనతలను గుర్తించింది. ఈ లోపాలు, లొసుగులను, బలహీనతలను అధిగమించేందుకు గానూ దిద్దుబాటు చర్యలను, కార్యకలాపాలను పార్టీ నిజాయితీగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి తీసుకోబోయే నిర్దిష్ట చర్యలను ఆగస్టు చివరి వారంలో జరిగే బెంగాల్‌ ‌పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశంలో, సెప్టెంబరు రెండో వారంలో జరిగే కేరళం రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాల్లో ప్రకటిస్తారు.

భవిష్యత్‌ ‌కార్యక్రమాలు

ఎన్నికల సంస్కరణల కోసం ప్రచారోద్యమం : మొత్తంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను డిమాండ్‌ ‌చేస్తూ విస్తృత, ఉధృత ప్రచారోద్యమాన్ని చేపట్టాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా నిష్పాక్షిక రాజ్యాంగబద్ధమైన సంస్థగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ) పూర్తిగా రాజీ పడిపోయింది. ఓటు హక్కును డిమాండ్‌ ‌చేస్తూ, ఇసిఐ స్వతంత్ర, నిష్పాక్షిక స్వభావాన్ని పరిరక్షిస్తూ, సాధ్యమైనంతగా విస్తృత వర్గాలను పార్టీ సమీకరించాలి.

మహిళా రిజర్వేషన్‌ అమలుకు ప్రచారం : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌‌ను తక్షణమే అమలు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు ఇచ్చిన నిరసనల పిలుపునకు కేంద్ర కమిటీ మద్దతును తెలియచేసింది. ఈ డిమాండ్‌‌కు మద్దతుగా ప్రజలను, ఇతర వర్గ, ప్రజా సంఘాలను పార్టీ సమీకరించాలి.

సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారం : ఇరాన్‌, పాలస్తీనా, వెనిజులా, క్యూబాలపై అమెరికా దురాక్రమణను ఖండిస్తూ పార్టీ విస్తృత స్థాయిలో సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టాలి. అమెరికా దురాక్రమణ వైఖరిని ఖండిస్తూ సెమినార్లు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించాలి.

కార్మికులు, రైతుల నిరసనలు : కేంద్ర కార్మిక సంఘాలు (సిటియులు), ఎస్‌‌కెం ఇచ్చిన నిరసనల పిలుపులకు కేంద్ర కమిటీ మద్దతు తెలిపింది. ఆగస్టు 10వ తేదీన వారిచ్చిన జైల్‌ ‌భరో పిలుపునకు పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది.

విద్యార్ధుల డిమాండ్లకు మద్దతు : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ విద్యార్ధులు నిర్వహిస్తున్న నిరసనలకు కేంద్ర కమిటీ మద్దతు ఇచ్చింది. జులై 20న పార్లమెంట్‌‌కు మార్చ్‌ ‌నిర్వహించాలంటూ వారిచ్చిన పిలుపునకు కూడా మద్దతు ప్రకటించింది. ఈ డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ ఆరోగ్యం క్షీణించడం పట్ల కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డిమాండ్లను అంగీకరించి, వాటిపై చర్యలు తీసుకునేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం తీవ్రంగా ఖండించదగిన విషయం. పైగా ఆ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి, యువత వ్యతిరేక వైఖరికి ఇది మరో తార్కాణమని సిపిఎం పేర్కొంది.

అవినీతిపై నిలదీయండి

అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంలో సంఘ పరివార్‌ ‌నేతల ప్రమేయం వున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంఘ పరివార్‌‌ నేతృత్వంలో రామాలయ ఉద్యమం కోసం ముందుపీఠిన నిలబడిన అనేకమంది వ్యక్తులు ఇప్పడు ఆలయ విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ చర్యలు సంఘ పరివార్‌ అసలు స్వభావాన్ని బట్టబయలు చేశాయి. ఈ సంఘ పరివార్‌ ‌గ్రూపు అనేది అటు దైవభక్తి పట్ల లేదా ఇటు దేశ భక్తి పట్ల నిజంగా ఎలాంటి అభిమానం, ఆందోళన లేని సంస్థల సమాహారం. పూర్తి స్థాయిలో పచ్చి స్వార్ధ ప్రయోజనాల కోసమే పనిచేసే సంస్థగా వుంది. భక్తులందరూ సంఘ్‌ ‌ముసుగును గుర్తించాలని, తమ వద్దకు వచ్చినపుడు వారిని ప్రశ్నించడానికి ప్రయత్నించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని కూడా మీడియా వార్తలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలి, దోషులైన వారు ఏ పదవిలో వున్నా దానితో నిమిత్తం లేకుండా శిక్షించాలి. ఈ సంఘటనలు, నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ వంటివి చూసినట్లైతే ఆర్‌ఎస్‌ఎస్‌/‌ బిజెపి అవినీతి పద్దతులు మూకుమ్మడిగా బట్టబయలవు తున్నాయి. ఇది, మరే ఇతర పాలక పార్టీకంటే భిన్నంగా ఏమీ లేదు.

పౌరసత్వ వివాదం

పాస్‌‌పోర్ట్‌ అనేది పౌరసత్వానికి రుజువు కాదని ఇటీవల విదేశాంగ శాఖ ప్రకటించడమనేది వివక్షాపూరితమైన సిఎఎ, ఎన్‌ఆర్‌‌సిలకు అనుబంధంగా రూపొందించిన ఒక దాడి. చట్టబద్ధంగా ప్రభుత్వాలు జారీ చేసిన పత్రాలు కూడా చెల్లుబాటు కావంటూ జారీ చేసిన ఈ అభ్యంతరకరమైన ప్రకటన ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియతో ఆందోళనకర రీతిలో ముడిపడి వుంది. అత్యంత సమన్వయంతో చేపడుతున్న ఈ చర్యలు, ఎత్తుగడలన్నీ కూడా అత్యంత బలహీనులందరికీ ఓటు హక్కు లేకుండా చేయడం, వారి చట్టబద్ధతను తొలగించడం, చివరగా వారిని ఏ దేశానికి చెందని పౌరులుగా చేయాలనే నీచపుటెత్తుగడ, వ్యూహం కిందకే వస్తుంది. పౌరసత్వాన్ని ఆయుధంగా చేయడం ద్వారా మత ప్రాతిపదికగా పౌరుల నమోదు పట్టిక (కమ్యూనల్‌ ‌రిజిస్ట్రీ)ని రూపొందించేందుకు ప్రభుత్వం పునాది వేస్తోంది. దాన్నుండి మినహాయించాలనుకునే వారికి ఓటు హక్కు లేకుండా చేస్తోంది. ఎస్‌ఐఆర్‌, జనాభా మార్పుల కమిషన్‌, పాస్‌‌పోర్ట్‌‌పై ఈ వైఖరి ఇవన్నీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతాల ప్రకారం పౌరసత్వాన్ని పునర్నిర్విచించేందుకు చేపడుతున్న చర్యలే. భారతదేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చేందుకు గల తొందరపాటును వెల్లడిస్తున్నాయి.

బిజెపి ఆపరేషన్‌ ‌లోటస్‌

తన లక్ష్యాలను సాధించుకునేందుకు, దేశ ప్రజాస్వామ్య, లౌకికవాద స్వభావాన్ని మార్చేందుకు గానూ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు బిజెపి నడుం బిగించింది. పార్లమెంట్‌‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని దక్కించుకునేందుకు అత్యంత తెలివిగా ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుంది. పార్లమెంట్‌‌లో స్పష్టమైన మెజారిటీ వుంటేనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాకు కీలకమైన ఇతర చట్టాలను ​ఆమోదింపచేసుకునేందుకు వీలుంటుంది. ఈ చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాదు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దెబ్బ తీస్తున్నాయి. అంతేకాదు, రాజ్యాంగ సిద్దాంతాలు, సూత్రాల పట్ల ఏ మాత్రమూ గౌరవం లేని వారి వైఖరిని బట్టబయలు చేస్తున్నాయి.

బలవంతపు తరలింపులు

వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, వాటికి అత్యంత చవక రేట్లకే భూములను కేటాయిస్తున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఐటి కంపెనీలకు వేలాది ఎకరాలు కేటాయించారు. వీటిలో అదానీలు, అంబానీలే భాగస్వాములు. ఏళ్ళ తరబడి ఈ భూముల్లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు, వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీహార్‌, ఆంధ్రపదేశ్‌‌ సహా పలు ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు చూస్తున్నాం. ప్రజలను స్థానభ్రంశం చేయడంతో పాటు డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల భూగర్భ జలాలు చాలా వేగంగా హరించుకుపోతున్నాయి. పైగా పర్యావరణపరంగా అనేక ఇతర ముప్పులు పొంచి వున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్