ఢిల్లీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు మద్దతు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పరీక్ష పేపర్ లీక్, సిబిఎస్ఇ అవకతవకలకు బాధ‌్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఉద్యమానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, పౌరసమాజ, ఉద్యమ ప్రముఖులు మద్దతు తెలిపారు. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం 17వ రోజు పూర్తి చేసుకుంది. సిజెపి ఆందోళన 25వ రోజు పూర్తి చేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా, సినీ నటి స్వరా భాస్కర్, ఎన్‌సిపి ఎంపి ప్రియా సరోజ్, ఎన్‌సిపి ఎమ్మెల్యే రోహిత్ పవర్, బికెయు అధ్యక్షుడు నేత గుర్నామ్ సింగ్ చరుని జంతర్ మంతర్ చేరుకుని, సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు, సిజెపి ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రముఖ నటి జీనత్ అమన్, నటుడు ఓమీ వైద్య, 'ధురందర్' నటి అయేషా ఖాన్, నటుడు అభయ్ డియోల్, గాయకుడు, కళాకారుడు కాకా, నటుడు అతుల్ కులకర్ణి సంఘీభావం తెలియజేశారు. "నిజాయితీ, కరుణతో ఈ దేశాన్ని పునర్నిర్మించండి" అని అతుల్ కులకర్ణి యువతను కోరారు.
వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడం పట్ల ప్రముఖుల ఆందోళన
సీనియర్ నటులు నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, రచయిత్రి అరుంధతి రాయ్, ఆర్థికవేత్త జయతీ ఘోష్‌లతో సహా పలువురు ప్రముఖ రచయితలు, నటులు, విద్యావేత్తల బృందం కూడా మద్దతు తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించినందుకు నిరసనకారులకు "అపారమైన కృతజ్ఞతలు" తెలుపుతున్నామని, వాంగ్‌చుక్ సహా దీక్షలు చేస్తున్న వారి ఆరోగ్యం క్షీణిస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని సంయుక్త ప్రకటనలో తెలిపారు. "ముందున్న సుదీర్ఘమైన, మరింత కష్టతరమైన పోరాటం దృష్ట్యా, దయచేసి ఈ నిరాహార దీక్షను తక్షణమే విరమించాలని కోరుతున్నాము. ఈ పోరాటం ఒక మారథాన్, స్ప్రింట్ కాదు. రాబోయే రోజుల్లో మాకు మీరు, మీ బలం, నాయకత్వం అవసరం" అని పేర్కొన్నారు. "మీ డిమాండ్లకు స్పందించడంలో వారి నిర్లక్ష్యం, ఇప్పటికే మీలో చాలా మంది ఉన్న బలహీనమైన ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చుతుందేమోనని ఆందోళన చెందుతున్నాం" అని తెలిపారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్‌లో మద్దతు తెలిపారు.







కామెంట్‌లు (0)