ముఖానికి కవర్.. చేతులకు పాదరక్షలు
ప్రజాశక్తి-కదిరి టౌన్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అవమానించిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పూలే విగ్రహం ముఖానికి కవర్ కప్పి, చేతులకు పాదరక్షలు తొడిగారు. శనివారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఘటనపై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి–44 సమీపంలో ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో పోలీసులు నిఘా, పర్యవేక్షణ కొనసాగిస్తున్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహనీయుల విగ్రహాలను అవమానించడం సరికాదని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వ్యక్తులను వెంటనే గుర్తించి, కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు అధికారులను కోరుతున్నారు.







కామెంట్‌లు (0)