ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'నేరడి'కి తొలగని అడ్డంకులు

1 గంట క్రితం

iggir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 12:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- సుప్రీంకోర్టులో ఇప్పటికీ 3 ఒడిశా ఎస్ఎల్‌పిలు పెండింగ్

- 106 ఎకరాల భూ సేకరణే ప్రధాన సమస్య

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా నేరడి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణానికి అంతా క్లియర్ అయిపోయినట్టుగానే ప్రభుత్వం చెప్తున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత బ్యారేజీ మార్గం సుగమమైపోయిందంటూ, ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయమంటూ చేసుకున్నారు. తర్వాత జులైలో కేబినెట్ సమావేశంలో బ్యారేజీ నిర్మాణానికి రూ.641.10 కోట్లను కేటాయిస్తూ, మరో అడుగు ముందుకు పడినట్టుగా చెప్పుకొచ్చారు. అదే నెలలో ప్రభుత్వం అందుకు సంబంధించి జిఒను విడుదల చేయడంతో ఇక... నేరడి బ్యారేజీ నిర్మాణమే తరువాయి అన్నట్టుగా ప్రకటనలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ... నేరడి బ్యారేజీకి నవంబరులో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతామని, 2028 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్ ప్రాజెక్టుల సమీక్షలో చెప్పుకొచ్చారు. నేరడి బ్యారేజీ సంబంధించి రాష్ర్టానికి అనుకూలంగా కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకోవడం సంతోషకరమే అయినా, బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాల సేకరణే ప్రధాన సవాల్‌గా మారింది. ఇది అధికారులతో అయ్యే పనికాదని ప్రభుత్వానికి తెలిసినా ఆ బాధ్యతను వారిపై నెట్టినట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు భూ సేకరణ కోసం ఒడిశా అధికారులను సంప్రదిస్తున్నా వారిలో ఉలుకుపలుకూ లేదని సమాచారం. ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పిస్తేనేగానీ అక్కడి రైతులు ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. అది జరగాలంటే అక్కడి బిజెపి ప్రభుత్వం చొరవ చూపాలి. నేరడి నిర్మాణపై ఒడిశాకు ఉన్న సందేహాలు, భూముల పరిహారం చెల్లింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగితేగానీ భూ సేకరణ కొలిక్కి వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 30న గెజిట్ విడుదల చేసిన తర్వాత ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు చేయకపోగా, ఒడిశాలో పర్యటన చేస్తామని కూడా ఎక్కడా చెప్పడం లేదు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై 2021లో ట్రిబ్యునల్‌... ఎపి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్ఎల్‌పిలు) వేసింది. వాటిని ఇప్పటివరకు ఆ ప్రభుత్వం ఉపసంహరించుకోలేదు. నేరడిపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమూ ఉపసంహరించుకోవాలని ఒడిశాలోని బిజెపి ప్రభుత్వానికి చెప్పడం లేదు. బ్యారేజీ నిర్మాణానికి ఇది ఇబ్బందికరమేనని అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల మంజూరు జిఒలో సైతం పెండింగ్ ఎస్ఎల్‌పిలకు లోబడి ఇస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం.

బ్యారేజీ పూర్తయినా సాగు నీరు సందేహమే!

వంశధారపై హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీని 1971లో ప్రారంభించి 1976 వరకు సుమారు ఐదేళ్లు పాటు నిర్మాణం సాగించారు. నేరడి బ్యారేజీని నిర్మాణం పూర్తయినా ఆయకట్టు స్ఠిరీకరణ, శివారు భూములకు సాగు నీరు అందడం సందేహమేనన్న చర్చ నడుస్తోంది. ప్రధానంగా వంశధార ఎడమ కాలువను గొట్టా బ్యారేజీ నిర్మాణం సందర్భంలో నిర్మించారు.

2,200 క్యూసెక్కులు నీరు పారే అవకాశం ఉండగా కాలువ గట్లు బలహీనంగా ఉండటంతో ప్రస్తుతం 1800 క్యూసెక్కుల వరకే విడిచిపెడుతున్నారు. ఎడమ కాలువ ఆధునీకరణ పనులకు 2014లో టిడిపి ప్రభుత్వం హయాంలో రూ.450 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ వాటికి ఆమోదం తెలపలేదు. ప్రస్తుతం దాని అంచనా వ్యయం రూ.2,500 కోట్లకు చేరినట్టు సమాచారం. వంశధార కాలువలపై ఏర్పాటు చేసిన షట్లర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నీటిని నియంత్రించలేని పరిస్థితి ఉంది. 2009లో షట్టర్ల కొనుగోలులో అవినీతి చోటుచేసుకోవడంతో సిఐడి కేసు నమోదు చేసింది. అది ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో, కొత్త షట్లర్లను ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారుతున్నా కేసు పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. ఇటువంటి సమస్యలన్నీ అధిగమిస్తేనే నేరడి బ్యారేజీ నిర్మాణం అసలు లక్ష్యం నేరవేరు తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్