రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
దిగువ లంక గ్రామాల్లో అప్రమత్తత
భద్రాచలం వద్ద తగ్గుముఖం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి వరద దిగువ ప్రాంతాలకు చేరుతూ ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద భారీ ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతున్నప్పటికీ, దిగువ ప్రాంతాలైన కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలపై ప్రభావం ఇంకా కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆదివారం ఉదయం 8 గంటలకు గేజ్ స్థాయి 15.00 అడుగులు, రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు బ్రిడ్జి వద్ద 15.24 మీటర్లు నమోదైంది. బ్యారేజ్ నుంచి 14,61,222 క్యూసెక్కుల మిగులు నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం పెరుగుతున్న ధోరణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బ్యారేజ్ వద్ద గేజ్, పాండ్ లెవల్, మిగులు ప్రవాహం గంట గంటకూ పెరిగినట్లు రీడింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఉదయం 5 గంటలకు 14.80 అడుగులుగా ఉన్న గేజ్ స్థాయి ఉదయం 8 గంటలకు 15 అడుగులకు చేరగా, మిగులు ప్రవాహం 14.25 లక్షల క్యూసెక్కుల నుంచి 14.61 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.ఇదిలా ఉండగా, భద్రాచలం వద్ద వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. గతంలో 56.10 అడుగులకు చేరిన నీటి మట్టం ప్రస్తుతం 48.70 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం అక్కడ సుమారు 14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య నీటి మట్టం 51.5 అడుగుల నుంచి 51.0 అడుగులకు తగ్గింది. అయినప్పటికీ ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టర్ సమీక్ష
గోదావరి వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద వరద తగ్గుతున్నా దిగువ ప్రాంతాల్లో ప్రభావం కొనసాగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గంటి పెదపూడి, పిచుకల్లంక–రావులపాలెం, ఐనవిల్లి లంక కాజ్‌వేలపై సుమారు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ఫోర్ వీలర్ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అవసరమైన చోట్ల పడవలు, ట్రాక్టర్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మామిడికుదురు ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
తహశీల్దార్లు, ఇతర శాఖల అధికారులు ఉదయం 10 గంటలలోపు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, వరద ప్రభావిత గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, ఇతర అత్యవసర సౌకర్యాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద తగ్గుతున్నా, ఆ నీరు దిగువకు చేరుతున్నందున ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద భారీ ప్రవాహం కొనసాగుతోంది. కోనసీమ, గోదావరి లంక గ్రామాల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)