ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
ప్రజాశక్తి- యంత్రాంగం
గత నాలుగు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఆదివారం క్రమంగా శాంతించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద వరద నీటిమట్టం వేగంగా తగ్గింది. ఇక్కడ ఒక దశలో 56.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 41.30 అడుగులకు పడిపోయింది. 8,61,662 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో, అధికారులు అన్ని ప్రమాద హెచ్చరికలనూ ఉపసంహరించుకున్నారు. శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు 51.5 అడుగులుగా నమోదైన నీటిమట్టం ఆదివారం ఉదయం నాలుగు గంటలకు 51 అడుగులకు తగ్గింది. ఆ తర్వాత కూడా క్రమంగా నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 14.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. 13,96,738 క్యూసెక్కు నీటిని సముద్రంలోకి, 8,400 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఉధృతి తగ్గుతుండటంతో కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల లోతట్టు ప్రాంత ప్రజల్లో ఊరట నెలకొంది.
ఏలూరు జిల్లాలో జలదిగ్బంధంలోనే రహదారులు
వరద తగ్గుముఖం పట్టినా ఏలూరు జిల్లాలోని దాచారం-కుక్కునూరు, ముత్యాలంపాడు-వింజరం మధ్య ఉన్న కాజ్ వేలపై వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. గత నాలుగు రోజులుగా 15 గ్రామాలకు రాకపోకలు నిలిచే ఉన్నాయి. వేలేరుపాడు మండలంలోని ప్రధాన రహదారులు జలదిగ్బంధంలో ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 14,20,959 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద ఉధృతి తగ్గడంతో భద్రాచలం నుండి కుక్కునూరుకు రాకపోకలు యథావిధిగా సాగాయి.
పోలవరం జిల్లాలో జలదిగ్బంధంలోనే గ్రామాలు
పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని మురుమూరు గ్రామం సహా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గ్రామాల చుట్టూ బురదమయంగా ఉండడంతో పశువులకు మేత కొరత ఏర్పడింది. విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉండడంతో గ్రామాల్లో తక్షణం శుభ్రతా చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చింతూరు వద్ద శబరి నది కూడా శాంతించింది. నీటిమట్టం 25 అడుగులకు చేరడంతో ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకున్నారు. సోకులేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విఆర్.పురం మండలంలో శబరి పరివాహక ప్రాంతాలైన అడవి వెంకన్నగూడెం, సృష్టివారిగూడెం, గుండుగూడెం, చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, రామవరంలతో పాటు గోదావరి పరివాహక గ్రామాలైన వడ్డిగూడెం, వడ్డిగూడెం కాలనీ, శ్రీరామగిరి, కల్తునూరు, జీడిగుప్ప, పోచవరం, తుమ్ములేరు తదితర గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో వరద నీరు తగ్గడంతో బాధితులు ఇళ్లకు పయనమయ్యారు.
భద్రాచలం-కూనవరం మధ్య రహదారిపై వరద నీరు ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వరద నీరు తగ్గడంతో అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించారు.
పునరావాస కేంద్రాల్లోని వారిని పట్టించుకోని అధికారులు
రేఖపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వచ్చిన ముంపు బాధితులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదు. నిత్యావసర సరుకులు, తాగునీరు వంటివి కూడా అధికారులు అందించలేదు. తమను ఇప్పటివరకు ఎవరూ వచ్చి పరామర్శించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటర్ బాటిళ్లు, దోమ తెరలను పంపిణీ చేశాయి.








కామెంట్‌లు (0)