ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅనుబంధాలకు ‘కవిత్వం కురిసింది’

1 గంట క్రితం

kavitham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:57 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సమాజ వ్యవస్థల్లోని అస్తవ్యస్తత, అన్ని రంగాల్లోని విధ్వంసం, బాధాకరంగా, వ్యథాభరితంగా, పారదర్శకంగా కవి పట్టి చూపించారు. వీటితోపాటుగా కవి పర్యావరణ విధ్వంసాన్ని, దాని పరిరక్ష‍ణా ఆవశ్యకతను కూడా జొప్పించారు. ‘కవిత్వం కురిసింది’ పుస్తకంలోని కవితలు మానవీయ అనుబంధాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. కవి చెన్నాప్రగడ శర్మ రాసిన ప్రతికవితలోనూ చక్కటి సందేశాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుత పోటీప్రపంచంలో మనిషి ఉరుకులు, పరుగుల జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో అనేది కూడా పట్టి చూపించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఇదేతంతుగా ఉంటున్నారని చెప్పారు. మనిషి భౌతికంగా యాంత్రిక జీవితం గడపటం అనివార్యమవుతోంది. మనిషి కేంద్రంగా సమాజం, ప్రపంచం, పరిణామాలు ఇలా అనేక అంశాలు మన చుట్టూ ఉంటాయి. ఈ క్రమంలో సమాజగతంగా, సంఘపరంగా కవిత్వం చెప్పేటప్పుడు కవి కాస్త జాగురూకతతో వ్యవహరించాల్సిందే. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలపైన కొంతైనా అవగాహన ఉండాలి. ఆధునిక, అధునాతన అంశాలు, టెక్నాలజీ, సైన్సు పరమైన పరిణామాలను పరిశీలిస్తుండాలి. తన కవితల ద్వారా అదే సందేశాన్ని శర్మ చెప్పారు. సీనియర్‌ పాత్రికేయునిగా వివిధ పత్రికల్లో పనిచేసిన శర్మకు సమాజ పరిస్థితులు, నేటి సమాజం పోకడలు, ఆధునీకత కొత్త పోకడలు గురించి బాగా తెలుసు. ఇదే అంశాలను ఆయన తన కవితల్లో సుమధురంగా జొప్పించారు. ‘పచ్చని చెట్లు తోడుంటే’ ఎంత హాయో చెప్పారు. లేకుంటే నీ తర్వాతి తరాలు వీపు మీద ఆక్సిజన్‌ సిలిండర్‌తో నడవాలి అని గుర్తుచేశారు. ‘పిచ్చుకమ్మా నువ్వెక్కడమ్మా’ అని పిచ్చుకల జాతి కనుమరుగవుతున్న ఉదంతాన్ని పట్టిచూపారు. ‘అటో ఇటో’ కవితలో ఆధునిక జీవనశైలిని ఆవిష్కరించారు. ఆధునిక పాశ్చాత్య పోకడతో మానవీయ విలువలు కనుమరుగవుతున్న ఉదంతాలను పట్టిచూపారు. ‘కరోనా పోయినా’ కవితలో కరోనా పాఠం గుణపాఠంగా ఉండాలంటూ కూడా గుర్తుచేశారు. ‘కర్షకానందం, పండితే’ అనే కవితలో అన్నంపెట్టే రైతుల గురించి ప్రస్తావించారు. ‘ఏయ్‌ నిన్నే’లో డిజిటల్‌ యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాపుటాపులకు ఎలా అతుక్కుపోతున్నారోనేది వివరించారు. చిన్న పిల్లలను ప్లే స్కూల్సుకు, వృద్ధులను ఆశ్రమాలకు పంపించేయటం వంటివి కూడా ఆయన రాసిన కవితలో వ్యక్తమయ్యాయి. ‘సెల్‌ఫోన్‌ ఆత్మక్ష‍ోభ’లో కూడా చక్కటి సందేశాన్ని అందించారు. కవిత్వం కురిసింది పుస్తకంలో మొత్తంగా 85 వరకూ కవితలు ఉన్నాయి. అన్నీ ఒకదానికొకటి వైవిధ్యంగా ఉన్నాయి. చక్కటి పదజాలం, సులభమైన భాష, భావుకత వచన కవిత్వంలోని లోతుల్ని పట్టిచూపాయి. సంఘజీవనంలో ఉన్న మనం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు?, ప్రకృతి, పర్యావరణం, జీవావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆవిష్కరించారు. మొత్తం 114 పేజీలు ఉన్న ఈ పుస్తకం కవిత్వపు జల్లులను వెదజల్లిందనే చెప్పొచ్చు.

- కార్తికేయ

పుస్తకం పేరు : కవిత్వం కురిసింది

రచయిత పేరు : చెన్నాప్రగడ వెంకట నాగ సత్యనారాయణశర్మ

వెల : 120

ప్రతులకోసం : 9440587567

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్