దేశం ఇప్పుడెలా వుందీ...?
ఎండిపోయిన చొప్పకట్ట లాంటి
బక్కచిక్కిన తల్లి పొత్తిళ్లలో
పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న_
పసిపాప పాలిపోయిన బుగ్గ మీద
పారుతున్న కన్నీటి చారికలా వుంది!
దేశం ఇప్పుడెలా వుందీ...?
పేవ్ మెంట్ల మీద
ముసురుతున్న ఈగల్ని కసురుకుంటూ
పాచిపోయిన అన్నం మెతుకుల్ని
ప్రాణప్రదంగా తింటున్న
ముసలి అవ్వ మసక కన్నుల వెనుక
రాశిపోసుకున్న నైరాశ్యంలా వుంది!
దేశం ఇప్పుడెలా వుందీ..?
నాణ్యమైన చదువుల మధ్య
నమ్మకమైన పరీక్షా విధానాలతో
కాంతులీనాల్సిన ఉక్కు నరాల
విద్యుత్ తీగలు
నాసిరకం ప్రమాణాల ఇన్సులేషన్ దెబ్బకు
రహదార్ల మీద కట్టలుతెగి ప్రవహిస్తున్న
వుడుకు నెత్తుటి వరదలా వుంది!
దేశం ఇప్పుడెలా వుందీ...!
మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్న__
అత్యాచార హత్యారాయుళ్లనొదిలేసి
ప్రశ్నించే సూర్యుళ్లపైకి భౌతిక దాడుల
భీషణ వురుములతో విరుచుకుపడుతూ__
కారుమబ్బుల కటకటాల వెనక్కి నెట్టేస్తోన్న
కర్కశ రాజ్యం వదనమ్మీద మొలిచిన
వికృత రాక్షస రసి కురుపులా వుంది!
దేశం ఇప్పుడెలా వుందీ...?
సిరులు పొంగిన భరత భూమికి
చౌకీదారుల్లా వుండాల్సిన ప్రజా ప్రతినిధులు
చిల్లర దొంగల్లా ఢిల్లీ నుంచి గల్లీ దాకా
నల్ల చట్టాల మాటున నొల్లుకు పోతోంది చాలక
కోట్లాది భక్తులిచ్చిన కానుకల్ని సైతం
బొక్కేసి బోరవిరుచుకు తిరుగుతోంటే...
విస్తుపోయిన మూలవిరాట్ ముందు
వట్టిపోయిన హుండీలా వుంది!
దేశం ఇప్పుడెలా వుందీ...!
విద్వేష బీజాలనుంచి విస్తరించిన
విషపు వృక్షాలు వూడలుదిగి
మానవీయ తరువుల మూలాల్ని
ప్రశ్నార్ధకం చేసి పీడిస్తోంటే....
బతికుండగానే చితి పేర్చి వేధిస్తోంటే...
పావన భూమాత పాదాలమీద
పచ్చగా మొలిచిన పుట్టుమచ్చల్ని
కొట్టిపారేయటానికి మీరెవ్వరంటూ
సంభించిన ప్రశ్నల దొంతరలా వుంది!
సిద్ధం చేసిన మందు పాతరలా వుంది!!_
- పతివాడ నాస్తిక్







కామెంట్‌లు (0)