గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యమాలను ఉధృతం చేయడమే సీతారాం ఏచూరికి నివాళి

1 గంట క్రితం

sitaram.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మంగళగిరి: ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయడమే సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరికి అందించే నిజమైన నివాళి అని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. కేశవరావు, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాశం రామారావు అన్నారు. సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా గురువారం మంగళగిరిలోని సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవరావు, రామారావు మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఏచూరి, జీవితాంతం పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేశారని తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న సమయంలోనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సైతం ప్రశ్నించి తన పోరాట పటిమను చాటుకున్నారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో పేద ప్రజల సమస్యలను అనేకసార్లు సభలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాలను మరింత ఉధృతం చేయడమే ఏచూరికి నిజమైన నివాళి అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వి.వి. జవహర్‌లాల్‌, సీనియర్‌ నాయకులు జె.వి. రాఘవులు, జొన్న శివశంకర్‌రావు, పి. బాలకృష్ణ, రైతు సంఘం నాయకులు ఎం. శివసాంబిరెడ్డి, వల్లూరి భారతి, వై. బ్రహ్మేశ్వరరావు, సీపీఎం పట్టణ నాయకులు ఎం. నాగేశ్వరరావు, ఎం. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్