ఢాకా : మోసం ఆరోపణలతో బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ డబ్ల్యుహెచ్‌ఒ ప్రాంతీయ హెడ్ పదవికి రాజీనామా చేశారు. ఐక్యరాజ్యసమితి సంస్థ, , బంగ్లాదేశ్ అధికారుల దర్యాప్తుల మధ్య వాజెద్ ఆ పదవికి బుధవారం రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో డబ్ల్యుహెచ్‌ఒలో ఆమె పదవీకాలం ముగిసినట్లు పేర్కొంది. గతేడాది చివరలో డబ్ల్యుహెచ్‌ఒ వాజెద్‌ను జీతం లేని పరిపాలనా సెలవుపై పంపింది. హసీనా అనంతరం అధికారంలోకి వచ్చిన మధ్యంతర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్, మోసం, ఫోర్జరీ ఆరోపణలతో 2025 మార్చిలో ఆమెపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో ఆమెను తొలుత 2025 జులైలో జీతం లేని పరిపాలనా సెలవుపై పంపినట్లు మీడియా వెల్లడించింది.
చైనా పర్యటనకు సంబంధించి ఆమె ఆర్థిక మోసానికిపాల్పడ్డారని, అలాగే తన విద్యార్హతలను తప్పుగా చూపారని ఆరోపించింది. ఈ ఆరోపణలను వాజెద్ ఖండించారు. డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌కు ఆమె రాసిన రాజీనామా లేఖ ప్రకారం, వాజెద్ బంగ్లాదేశ్‌లో ఒక భూమిని అక్రమంగా సంపాదించారని కూడా డబ్ల్యూహెచ్‌ఓ ఆరోపించింది. అయితే తాను డబ్ల్యుహెచ్‌ఒలో చేరకముందే ఆ భూమిని సంపాదించానని, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత, హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాలకు వర్తించే బంగ్లాదేశ్ చట్టం ప్రకారం ఆ భూమికి తాను అర్హురాలినని వాజెద్ తెలిపారు. ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలకు సేవలందించేందుకు తాను ఎన్నికైనప్పటికీ, విధులు నిర్వర్తించకుండా తనను అడ్డుకున్నారని వాజెద్ పేర్కొన్నారు. డబ్ల్యుహెచ్‌ఒ నాయకత్వంపై విశ్వాసం, నమ్మకం పూర్తిగా సన్నగిల్లాయని పేర్కొన్నారు. జీతం లేని సెలవుపై ఏడాది పాటు గడపాల్సి రావడం తన ఆర్థిక ప రిస్థితిని దుర్భరం చేసిందని పేర్కొన్నారు. దీనిపై డబ్ల్యుహెచ్‌ఒ స్పందించేందుకు నిరాకరించింది.
హసీనాను పదవి నుండి తొలగించడం వలన తలెత్తిన రాజకీయ పరిణామాలు ఆమె కుటుంబసభ్యులను, సన్నిహితులను ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్యమంగా మారడంతో, 2024 ఆగస్టులో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుండి పారిపోవాల్సి వచ్చింది.







కామెంట్‌లు (0)