- కలెక్టర్ కీర్తి చేకూరి
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో విధులు నిర్వహించే వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలను ముందుగానే గుర్తించి, పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా వసతి సౌకర్యాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సమయంలో వివిధ శాఖల నుంచి ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారనే వివరాలను ముందుగానే సేకరించి, అందుకు అనుగుణంగా వసతి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి తహశీల్దార్ తమ పరిధిలో ఎంతమంది సిబ్బందికి వసతి అవసరమవుతుందో, ఏయే కేటగిరీలకు చెందిన సిబ్బందికి వసతి కల్పించాల్సి ఉంటుందో మండలాల వారీగా గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు. ఐఎఎస్ స్థాయి అధికారుల నుంచి పారిశుధ్య సిబ్బంది వరకు వివిధ కేటగిరీల సిబ్బంది అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున శాఖల వారీగా నియమించే సిబ్బంది వివరాలను ముందుగానే అందిస్తామని, వాటి ఆధారంగా మండల స్థాయిలో వసతి ప్రణాళికను ఖరారు చేయాలని స్పష్టం చేశారు.
శాశ్వత ఘాట్లు, తాత్కాలిక ఘాట్ల వారీగా సిబ్బంది నియామకాన్ని ముందుగానే అంచనా వేసి, వారికి కేటాయించే విధులకు అనుగుణంగా సమీప ప్రాంతాల్లో తగిన వసతి ఉందా లేదా పరిశీలించాలన్నారు. వైద్య, పోలీసు, పారిశుధ్య తదితర అత్యవసర సేవల సిబ్బందికి ఘాట్లకు సాధ్యమైనంత సమీపంలోనే వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది షిఫ్టుల సమయాలు, విశ్రాంతి సౌకర్యాలు, ఆహార తయారీ, ఆహార సరఫరా వంటి అంశాలను కూడా ముందస్తు ప్రణాళికలో పొందుపరచాలని ఆదేశించారు.
తాత్కాలిక పుష్కర నగరాల ఏర్పాటుకు గుర్తించిన స్థలాల్లో వసతి సౌకర్యాలతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మరుగుదొడ్లు, స్నానపు గదులు తదితర మౌలిక వసతులను ముందుగానే కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, వసతి గృహాలు, ప్రైవేటు అతిథి గృహాలు, హోటళ్లు తదితర అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలను గుర్తించాలని తెలిపారు. విఐపి వసతి అవసరాలను కూడా ముందుగానే గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వసతి సౌకర్యాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. స్థానికంగా ప్రజల నుంచి వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో ముందుగానే గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలో పొందుపరచాలన్నారు.
జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ ప్రతి శాఖ నుంచి పుష్కరాల విధులకు నియమించనున్న సిబ్బంది వివరాలను ముందుగానే సేకరించి, వారి సంఖ్యకు అనుగుణంగా మండలాల వారీగా వసతి అవసరాలను నిర్ధారించాలన్నారు. శాశ్వత, తాత్కాలిక ఘాట్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన వసతి, ఆహారం, విశ్రాంతి తదితర సౌకర్యాలపై సంబంధిత శాఖలు ముందస్తు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. వసతి ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర పరిధిలో పుష్కరాల విధులకు వచ్చే అధికారులు, సిబ్బంది కోసం అందుబాటులో ఉన్న వసతి ప్రాంతాలను గుర్తించి, వాటి సామర్థ్యం, మౌలిక సదుపాయాలపై వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. హోటల్ నిర్వహణ సంఘం ప్రతినిధులతో ఈ వారంలో సమావేశం ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న వసతి గదులు, ఆహార తయారీ, సరఫరా తదితర అంశాలపై వివరాలు సేకరించాలని అధికారులను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలకు చెందిన అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. శాఖల వారీగా సిబ్బంది నియామకం, మండలాల వారీగా వసతి అవసరాలు, శాశ్వత–తాత్కాలిక ఘాట్ల వద్ద సిబ్బంది కేటాయింపు, తాత్కాలిక పుష్కర నగరాల్లో మౌలిక వసతులు, ఆహార సరఫరా తదితర అంశాలపై అధికారులు వివరాలను సమర్పించారు.









కామెంట్‌లు (0)