మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపవన రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు

1 గంట క్రితం

lokesh .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:35 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అనంతపురం అంటే కియా, ఫైటర్ జెట్లు, సుజ్లాన్‌ రెన్యూవబుల్ ఎనర్జీ

  • సుజ్లాన్‌ ప్రాజెక్టు శంకుస్థాపనలో మంత్రి లోకేష్

‌ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్ : ఆంధ్రప్రదేశ్‌లో సుజ్లాన్ సంస్థ రూ. పదివేల కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం పూలచర్ల వద్ద ‌సుజ్లాన్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేశారు. 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్‌‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. సంస్థ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల వివరాలను నారా లోకేష్‌ ‌తెలుసుకున్నారు. అంతకుముందు బళ్లారి సమీపంలోని హలకుంది గ్రామంలో సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. సుజ్లాన్‌ రాకతో ఆంధ్రప్రదేశ్ రెన్యువ‌బుల్ ఎనర్జీ పెరిగిందన్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో ‌సుజ్లాన్‌ పవన విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రీన్ ఎన‌ర్జీలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అనంతపురం అంటే మొన్న కియా కార్లు, నిన్న ఫైటర్ జెట్లు, నేడు సుజ్లాన్ రెన్యువబుల్ ఎనర్జీ అనేలా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌‌ను నంబర్ వన్‌గా నిలబెడతామన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో పవన విద్యుత్తు కేవలం ఆరు మెగావాట్ల సామర్థ్యం మాత్రమే ఉండేదని, ఇప్పుడు అనంతపురంలోని సుజ్లాన్ యూనిట్‌కు ఏడాదికి సుమారు 1260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉందన్నారు. ఇందులో ప్రత్యక్షంగా సుమారు 1200 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. వారిలో 70 శాతానికి పైగా స్థానికులే ఉన్నారన్నారు. 1325 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో చేపట్టిన ఆ ప్రాజెక్టు సుమారు రూ.పది వేల కోట్ల పెట్టుబడి, నాలుగు వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను తీసుకొస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌-సుజ్లాన్ భాగస్వామ్యంతో 12వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకట ప్రసాద్, సుజ్లాన్ గ్రూప్ కో ఫౌండర్, వైస్ చైర్మన్ గిరీష్ తంతి, సిఇఒ అజయ్ కపూర్, అడ్వైజర్ విబి రావు, టాటా పవర్ ఎండి, సిఇఒ సంజయ్ బంగా, సుజ్లాన్ గ్రూప్ డైరెక్టర్ రంజిత్ సిన్హ్ అభయ్ సిన్హ్ పర్మార్, ఎన్ఆర్ఇడిసిఎపి లిమిటెడ్ విసి, మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబు, టోరెంట్ పవర్ డైరెక్టర్ జిగీష్ మెహతా, వారీ ఎనర్జీస్ సిఎండి హితేష్ దోషి, అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్