శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కృష్ణా డెల్టాకు సాగునీరివ్వండి

03 ఆగస్టు, 2026

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏలూరు కలెక్టరేట్‌ ‌వద్ద రైతుల ధర్నా

ప్రజాశక్తి - ఏలూరుఅర్బన్‌ : ఏలూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టాకు సాగునీరందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. వారిని కలెక్టరేట్‌‌లోకి వెళ్లనీయకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్తే కేసులు పెడతామని బెదిరించడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అనంతరం రైతులు బారికేడ్ల వద్ద బైఠాయించారు. రైతు సంఘం, రైతుల ప్రతినిధి బృందం పిజిఆర్ఎ‌స్‌‌లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేసి సాగునీటిపై చర్చలు జరిపారు. దీనిపై కలెక్టర్‌ ‌స్పందిస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల పరిధిలోని కృష్ణా డెల్టా ఆయకట్టుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గోదావరి జిలాలు అందించే అవకాశమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. గోదావరి మెయిన్ కెనాల్‌ను ఆధు‌నీకరించకుండా నిర్లక్ష్యం చేసి రైతులను బలి చేయడం తగదని విమర్శించారు. జూన్ 15 నుండి కృష్ణా డెల్టాకు సాగునీరిస్తామని చెప్పి, సబ్సిడీపై వరి విత్తనాలు సరఫరా చేసి ఇప్పుడు అర్ధాంతరంగా సూపర్ ఎల్‌నినో పేరిట వరి సాగు చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పడం ప్రణాళికా లోపమేనన్నారు. పట్టిసీమ నీ‌టిను కృష్ణా డెల్టాకు మళ్లించి పంటల సాగుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏలూరు రూరల్ మండలం కృష్ణా ఆయకట్టుకు పోణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. తాడిపూడి ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరివ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పలువురు రైతులు మాట్లాడి తమ కష్టాలు వివరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు మాట్లాడుతూ సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్