- నేడు ఉపాధ్యాయ దినోత్సవం
అక్షర జ్ఞానానికి లోక జ్ఞానాన్ని జోడించి శాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థిలో నింపే సామాజిక శాస్త్రవేత్త ఉపాధ్యాయుడు. చరిత్రను సృష్టించేవారు, సమాజాన్ని నిర్మించేవారు ప్రజలు మాత్రమేనని విద్యార్థులకు చెప్పే చరిత్రకారులు ఉపాధ్యాయులు. తరగతి గదిలో నాలుగు గోడల మధ్య నుంచి జాగృతిని కల్పించే వారు, జ్ఞాన జ్యోతిని వెలిగించే వారు ఉపాధ్యాయులు. సమసమాజ స్థాపనకు తమ వంతు కృషి చేసే ఉపాధ్యాయ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా విద్యార్థి-ఉపాధ్యాయుడు-విద్యా వ్యవస్థను రేఖా మాత్రంగా పరిశీలన చేద్దాం.
నాటి చదువులు...
ప్రభుత్వ బడులు 90 శాతం, ఎయిడెడ్ స్కూళ్లు 10 శాతంగా ఉండేవి. ఆనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోనే ఆ పాఠశాలలు పనిచేశాయి. ర్యాంకుల గోల లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రకృతితో మమేకం చేస్తూ చదువు చెప్పేవాళ్ళు. విద్యార్థులను క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయి నాటి కష్టజీవుల జీవన శైలిని చూపేవారు. విహార యాత్రలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చదువులో భాగంగా ఉండేవి. గ్రామంలో రాత్రి పాఠశాలలను నడపటం ఉపాధ్యాయుల వృత్తిలో భాగంగా ఉండేది. పర్యవేక్షణకు వచ్చిన అధికారులు సలహాలు, సూచనలతో మరింత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఉపాధ్యాయులకు ఇచ్చేవారు.
నేటి చదువులు...
ప్రపంచీకరణ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. ‘నేను’ అనే భావనకి పెద్ద పీట వేసింది. పోటీతత్వాన్ని పెంచింది. వినిమయ సంస్కృతిని ముందుకు తెచ్చింది. వీటన్నిటి కోసం అవసరమైతే కొన్ని దేశాలకు చదువు కోసం అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. ఆ చదువుల్లో పోటీతత్వాన్ని పెంచేసింది. సాధించలేకపోతే వేస్ట్ అనే ధోరణిని అలవరచింది. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల సంఖ్య పెరిగిపోయింది. ఇచ్చిన అప్పులతో నడిచే చదువులు ఎలా ఉండాలనే దానికి పైస్థాయి నుంచి కింది వరకు ఒక యంత్రాంగాన్ని సృష్టించింది. దాంతో పాఠశాలల పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు పెరిగిపోయాయ్. గణాంకాలు, లెక్కలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యాప్‌లు, వాటిని నింపి సబ్‌మిట్ చేయడం ప్రధానంగా మారిపోయింది. పిల్లలు ఏం నేర్చుకున్నారనేది చూసేకంటే...తాము అడిగిన సమాచారం వచ్చిందో లేదో తెలుసుకోవడమే ముఖ్యంగా మార్చేశారు. పోటీ పడు, గెలవలేకపోతే వేస్ట్ అనే వరకు వెళ్లారు. 99.9 శాతం మార్కులు తెచ్చుకున్నా ఆ 0.1 శాతం ఎందుకు తగ్గిందని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చేశాయి. ఇంత ఒత్తిడిలో చదువుకునే చదువు వ్యక్తిగతంగా ఆ చిన్నారులకు ఉపయోగపడుతుందో లేదోగాని సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేదు. బడిలో పిల్లల మనస్తత్వం, అక్కడ ఉన్న వాతావరణం, ఆ పిల్లల స్థాయిని బట్టి ఏం నేర్పాలో ఎలా నేర్పాలో, వారిని ఒక స్థాయికి ఎలా తీసుకురావాలో స్థానిక ఉపాధ్యాయుడికి తెలుస్తుంది. కానీ టీచర్ కి పాఠశాలలో స్వేచ్ఛ లేదు. బడిలో వారు ఏం చెప్పాలో కూడా పై నుంచి చెప్తున్నారు. పరీక్ష ఏం పెట్టాలో కూడా పైనుంచి ఇస్తున్నారు. ఈ చదువుతో మంచి బాధ్యత కలిగిన పౌరుణ్ణి తయారు చేయడం సాధ్యమా? అందుకని స్వేచ్ఛాయుతంగా ఉపాధ్యాయుడు చదువు చెప్పే వాతావరణం ఉండాలి. అక్షర జ్ఞానాన్ని మాత్రమే నేర్పటం ఉపాధ్యాయుడి పనిగా ఉండకూడదు. సమాజంలోని అన్ని అంశాల పట్ల సమగ్ర మూర్తిమత్వం కలిగిన విద్యార్థుల్ని తయారు చేసే బాధ్యత కూడా ఉపాధ్యాయులు తీసుకోవాలి.
ప్రస్తుత పాఠశాలల పరిస్థితి...
ఏకోపాధ్యాయ పాఠశాలలు 14,000 వున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య అనుకున్నంతగా పెరగలేదు. అనధికారికంగా మూతపడిన పాఠశాలలు అనేకం ఉన్నాయి. గత పాలకులు 3, 4, 5 తరగతులను హైస్కూల్‌కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు వచ్చిన పాలకులు 3, 4, 5 తరగతులను మోడల్ స్కూల్ కి షిఫ్ట్ చేశారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లిన పిల్లలు కొద్దిమంది ప్రైవేట్ పాఠశాలకు కూడా మారిన పరిస్థితులున్నాయి. మోడల్ ప్రైమరీ పాఠశాలలంటే ఐదు తరగతి గదులు ఐదుగురు ఉపాధ్యాయులు అనే కాన్సెప్ట్‌తో ప్రారంభించారు. కాని ఐదు తరగతి గదులకు ఐదుగురు ఉపాధ్యాయులను ఇవ్వలేదు. దీనివల్ల మోడల్ పాఠశాల కాన్సెప్ట్ బలహీనపడటంతో పాటు, ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూనే ఉంది. ఏమైనా ఆ పాఠశాలలను బతికించుకోవాలంటే ఐదుగురు ఉపాధ్యాయులు, ఐదు తరగతి గదులు ఇచ్చి దానికి ఒక ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలి. ‘కర్మయోగి , దీక్ష ప్రశస్త’ అనే రకరకాల యాప్ లను అప్‌లోడ్ చేసుకోవటం, వాటిని చదవడం, పరీక్షలు రాయడం పెద్ద పనిగా మారింది. దీనికి సంబంధించి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు అదనపు పనుల భారం తగ్గించి బడిలో పాఠాలను బోధించే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. పిల్లలకు అక్షరాలు ఏం వచ్చాయనే దానిమీద కేంద్రీకరణ ఉండాలి.
చేయాల్సింది...
సమాజం ఉపాధ్యాయుల మీద పెద్ద బాధ్యత పెట్టింది. ఏ రంగానికి సంబంధించిన వారినైనా తయారు చేసే పని ఉపాధ్యాయులదే. వారు నిజాయితీగా, నిబద్ధతతో, సమాజ అవసరాలకు తగ్గట్టు పని చేయాలన్నా పాఠశాల స్థాయిలోనే పునాది పడాలి. పసితనంలో పడ్డ పునాది కచ్చితంగా తన జీవితాంతం గుర్తుపెట్టుకుని పనిలో కనబరుస్తారు. పిల్లల కష్టంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలి. వారి కుటుంబాలతో అనుబంధాన్ని పెంచుకోవాలి. చుట్టూ ఉన్న సమాజానికి బడి పట్ల ఒక నమ్మకాన్ని కలిగించాలి. తల్లిదండ్రులు రోజువారీ పనిలోపడి పిల్లల గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు బయట సమాజంలోని అవలక్షణాల పట్ల త్వరగా ఆకర్షితులవుతున్నారు. వీరిని మార్చాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులు తీసుకోవాలి. గంజాయి, దొంగతనాలు, తప్పుడు పనులు, దానికి పడే శిక్షలు, కౌన్సిలింగ్ కూడా చదువులో భాగంగా చెప్పాలి. కులం, మతం పేర విభజన అంశాలు సమాజంలో స్వైరవిహారం చేస్తున్నాయి. సమాజంలో, బడిలో సమానత్వ భావనను బోధించాలి. జెన్ జీ, జెన్ ఆల్ఫా లాగా ప్రశ్నించే తరాన్ని తయారుచేయాలి. అదే సమయంలో ఉపాధ్యాయులు తమ పనిలో నైపుణ్యాన్ని, బాధ్యతను పెంచుకోవాలి.
- వ్యాసకర్త : ఎన్. వెంకటేశ్వర్లు,
యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు







కామెంట్‌లు (0)