పాఠశాల అంటే.. పిల్లలు, పుస్తకాలు, నల్లబల్ల.. మాత్రమే కాదు. వాటన్నింటి ముందు విద్యార్థులకు బాసటగా, భరోసాగా నిలబడే టీచర్ కూడా. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో టీచర్లు పోషించే పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైనది. అలాంటి కథలు ప్రపంచంలో ఎప్పుడూ వినిపిస్తాయి. ఇప్పుడు అమెరికా ఆర్థిక దిగ్బంధనం కారణంగా సంక్షోభంలో ఉన్న క్యూబాలో కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది సెప్టెంబరు 1న అక్కడ స్కూళ్లు తెరుచుకుంటాయి. ఈనెల 1వ తేదీ మంగళవారం స్కూళ్లు తెరుచుకునే సమయానికి క్యూబా స్కూళ్లల్లో విద్యుత్తు లేదు. తరగతి గదిలో ఫ్యాన్లు తిరగటం లేదు. పాఠ్యపుస్తకాలు, బోధనా సామగ్రి కొరత.. రవాణా కష్టాలతో పిల్లలు పాఠశాలకు చేరుకోవడమే సవాలుగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వేలాది మంది టీచర్లు తరగతి గదుల తలుపులు తెరిచారు. టీచర్ల కొరతతో ఏ స్కూలు మూతబడకుండా కొందరు రిటైర్డు ఉద్యోగులు కూడా బోధనకు సిద్ధమయ్యారు. మరికొందరు టీచర్లు రెట్టింపు మంది పిల్లల బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. దేశం ఎదుర్కొంటున్న కొరతలు వారి జీవితాలను కుదిపేస్తున్నా.. పిల్లల భవిష్యత్తును కొరతలో పడనివ్వకూడదన్న పట్టుదల ఆ టీచర్లలో కనిపిస్తోంది.
క్యూబా విప్లవ స్ఫూర్తి ఈ కష్టకాలంలో మళ్లీ కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యారంగం ప్రత్యేక దృష్టితో పనిచేస్తోంది. సుమారు 14 లక్షల మంది పిల్లలు సెప్టెంబరు 1న స్కూళ్లకు చేరుకున్నట్లు క్యూబా విద్యాశాఖా మంత్రి ప్రకటించారు. అయితే అప్పటికే క్యూబా స్కూళ్లల్లో 21 వేల మంది టీచర్ల కొరత ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు క్యూబా రాజధాని హవానా పాఠశాలలకు 3 వేల మంది టీచర్లను ఇతర ప్రాంతాల నుండి భర్తీ చేయాల్సివచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని విశ్రాంత ఉపాధ్యాయురాలు 77 ఏళ్ల నెరిస్ నవారో తన తరగతికి మళ్లీ వచ్చారు. మరో చోట లైబ్రేరియన్‌గా రిటైర్డ్ అయిన సురా విక్టోరెరో ల్లెరెనా 39 ఏళ్లు తను పనిచేసిన పాఠశాలకే మళ్లీ తిరిగి వచ్చారు. ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్నాక కూడా తాము ఎందుకు వచ్చామో ఆ టీచర్లు ఇలా చెప్పారు. ‘మేమంతా.. ఒకే కుటుంబం. ఒకరికొకరు సాయంగా నిలబడతాం. పరిస్థితులు చక్కబడేంతవరకు కలసి పనిచేస్తాం` అన్నారు.
ఆపద వేళ ... ఆదుకున్నారిలా...
క్యూబా ఉపాధ్యాయుల అంకితభావాన్ని కేవలం ప్రస్తుత ఇంధన, విద్యుత్ సంక్షోభంతోనే కొలవలేం. 2025 అక్టోబర్‌లో హరికేన్ మెలిస్సా తూర్పు క్యూబాను తాకినప్పుడు వేలాది మంది విద్యార్థుల చదువుకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 వేల పాఠశాలలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్ని చోట్ల పాఠశాల భవనాలే తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా మారాయి. గ్రాన్మా ప్రావిన్స్‌లోని కౌటో క్రిస్టో ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు లెయిడీ పాంటోజా తన అనుభవాన్ని ఇలా చెప్పారు. 'వరద నీరు పెరిగి, ఇళ్లల్లో ఉండటం ప్రమాదకరంగా మారింది. చాలా కుటుంబాలు పాఠశాలలకు చేరుకున్నాయి. వారికి అండగా నిలబడేందుకు మేమంతా కుటుంబాలతో సహా అక్కడే ఉన్నాం` అని చెప్పారు. ఆ సమయంలో క్యూబాలో ఎందరో ఉపాధ్యాయులు ఆపదలో ఉన్న ప్రజలకు తోడుగా నిలిచారు. పాఠశాలలు దెబ్బతినడంతో కొంతమంది టీచర్ల ఇళ్లు, పొరుగువారి ఇళ్లు, బంధువుల ఇళ్లు తరగతి గదులుగా మారాయి. కొన్ని చోట్ల చెట్ల నీడలో కూడా తరగతులు నిర్వహించారు. గ్వాంటనామోలో 23 విద్యాసంస్థలు దెబ్బతిన్న పాఠశాలల పిల్లలకు ఆశ్రయం కల్పించాయి. ఆ వరదల్లో కొందరు పిల్లలు తమ ఇళ్లను, వస్తువులను పూర్తిగా కోల్పోయారు. ఆ భయం, విషాదం నుంచి పిల్లలను బయటకు తీసుకురావడానికి కళలు, సంగీతం, మానసిక - సామాజిక సహాయ కార్యక్రమాలను విద్యలో భాగంగా టీచర్లు బోధించారు.

అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్ కూడా దీనిపై స్పందించింది. ‘మెలిస్సా తుపాను కారణంగా క్యూబాలో పిల్లల చదువుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే పాఠశాలలు కేవలం చదువు చెప్పే ప్రదేశాలు మాత్రమే కాదు. పిల్లలకు రక్షణ, స్థిరత్వం కల్పించే ప్రదేశాలు కూడా! విపత్తు తర్వాత మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు, చదువులో నష్టం, పిల్లల రక్షణ వంటి అంశాలు కూడా ప్రభావితమయ్యాయ’ని పేర్కొంది. తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ప్రకృతి విపత్తు సమయంలో కూడా తన బాధ్యతను సమర్థవంతంగా ఎలా నిర్వర్తించాలో ఈ ఉదాహరణ చెబుతోంది. ఉపాధ్యాయుడు అంటే.. కేవలం పాఠం చెప్పే వ్యక్తిగానే కాక, పిల్లల భయాన్ని అర్థం చేసుకునే మనిషిగా, వారి ఒత్తిడిని తగ్గించి మళ్లీ మామూలు మనిషిగా నిలబెట్టే గొప్ప ఆలంబనగా ఉండాలి. సంక్షోభంలో ఉన్న పిల్లవాడిని తిరిగి నిలబెట్టడం కూడా విద్యలో ఒక భాగమని క్యూబా టీచర్లు చెబుతున్నారు. అమెరికా సృష్టించిన ఇప్పటి ఆర్థిక సంక్షోభ సమయంలోనూ అదే అంకితభావాన్ని, ఆదర్శాన్ని కొనసాగిస్తున్నారు.
ఏటా సెప్టెంబర్ 5న మనం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను స్మరించుకుంటాం. పూలు ఇస్తాం. శుభాకాంక్షలు చెబుతాం. కానీ సంక్షోభ కాలంలో ఉపాధ్యాయుడి విలువను అర్థం చేసుకోవాలంటే క్యూబా పాఠశాలల వైపు ఒక్కసారి చూడాలి. అక్కడ ఉపాధ్యాయులు చాక్ పట్టిన చేతితోనే అవసరమైతే ఒక కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. పిల్లల భయాన్ని తగ్గిస్తున్నారు. తమ సౌకర్యాలను పక్కనపెట్టి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు. దేశం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా క్యూబాలో కొన్ని తరగతి గది తలుపులు మూసుకుపోకుండా వాటి వెనుక ఒక టీచర్లు నిలబడ్డారు. పిల్లల భవిష్యత్తుపై నమ్మకం ఉన్నంతకాలం.. ఆ తలుపులు మూసుకుపోవని క్యూబా ఉపాధ్యాయులు ప్రపంచానికి చెబుతున్నారు.







కామెంట్‌లు (0)