శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సదా స్మరామి

1 గంట క్రితం

teacher
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎన్నో దారాలను

కళాత్మకంగా కూర్చే సూదిమొనవై,

విద్యార్థులను సానబెట్టి విజ్ఞానమందిస్తూ,

విద్యల కర్మాగారాన

మట్టిముద్దలకు ఆకృతినిచ్చే

అమరశిల్పి జక్కన్నవై,

క్షాత్రతూణీరాలను

సమాజంపై ఎక్కుపెట్టిన గాండీవివై,

భావియువతరం

జీవనరేఖల్ని సరిచేస్తూ,

కర్మయోగిలా కాలాన్ని నడిపిస్తూ,

పొత్తాలకు అందని చదువుచెప్పే

తత్వవేత్తగా

నాలుగు గోడల మధ్య

విజ్ఞాన వర్షాన్ని కురిపించి,

అలసిసొలసే వార్షుకాభ్రమై,

అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే తమోభేదీ!

స్వల్పలోపానికే తెగడికకు గురయ్యే

ఓ విజ్ఞాననిధీ!

విరించికే లేని పూజార్హత కలిగిన

ఓ గురుబ్రహ్మా!

ఆధునిక పోకడలతో

మసకబారిన గురుభక్తి,

గురుపూజాదినోత్సవాన

విలసిల్లే గౌరవ ప్రపత్తులతో,

సదా నీ ఎడ ధృవతారలా భాసిస్తూ,

భావితరాలకు ఆదర్శమై నిలవాలి.


- వేమూరి శ్రీనివాస్,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాషా పురస్కార గ్రహీత

సెల్‌: 9912128967

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్