శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఎల్‌‌నినో’ సన్నద్ధత ఇలాగేనా?

1 గంట క్రితం

andhra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

యావత్‌ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఎల్‌‌నినో రానున్న రోజుల్లో ఇప్పటి కంటే మరింత ఉధృతమవుతుందని, వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఒ) తాజాగా చేసిన హెచ్చరిక ఎల్‌‌నినో ప్రభావాన్ని చవిచూస్తున్న మన రాష్ట్రానికి ప్రమాద ఘంటిక. ఎల్‌‌నినోతో అనూహ్య, అసాధారణ వర్షాలు, వరదలు, కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు సంభవిస్తాయి. ఎల్‌‌నినోపై అంచనాలు ప్రారంభమయ్యాక గడచిన దశాబ్దాల్లో కంటే ప్రస్తుత ప్రభావం చాలా ఎక్కువని, ప్రభుత్వాల సన్నద్ధత, స్పందన సైతం అసాధారణంగా ఉండాలని సూచించింది. నిజానికి సీజన్‌ ‌ప్రారంభానికి ఎంతో ముందుగానే ఎల్‌‌నినోపై డబ్ల్యుఎంఒ హెచ్చరికలు చేయగా, భౌగోళికంగా తుపాన్లు, వరదలు, కరువులకు ఆస్కారం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ‌సన్నద్ధత, స్పందన సరిగ్గా లేదని ముందస్తు ఏర్పాట్లను, ప్రణాళికలను చూస్తే అర్థమవుతుంది. వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌కు ఖరీఫ్‌ ప్రాణాధారమన్న విషయం ఏలికలకు తెలియనిది కాదు. తాగునీటి సమస్యలు తలెత్తుతాయనీ ఎరుకే. ఎల్‌‌నినో ప్రభావం సీజన్‌ ‌మొదట్లో అంతగా ఉండదని సన్నద్ధతపై పెట్టాల్సిన స్థాయిలో శ్రద్ధ వహించలేదు. ఆగస్టు ముగిసి సెప్టెంబర్‌‌లో పడ్డాక ఇప్పుడు తీరిగ్గా ఎల్‌‌నినో పరిస్థితులపై వివరిస్తూ, ఆర్థిక సహాయాన్ని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించడం విడ్డూరం. ఇదే ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అతి పెద్ద మేలుగా ప్రచారం చేసుకోవడం అభ్యంతరకరం.

నైరుతి రుతుపవనాల చలనంలో బలహీనత, ఎల్‌‌నినో కట్టకట్టుకొని రాష్ట్రంపై దాడి చేయడంతో ఖరీఫ్‌ ‌సేద్యం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఏ నెలలోనూ ఏ జిల్లాలోనూ ఇప్పటి వరకు సాధారణ వర్షం పడలేదు. జూన్‌ ‌నుంచి ఆగస్టు చివరాఖరు వరకు వర్షపు లోటు 54 శాతం. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, మార్కాపురం, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షపు లోటు 60 నుంచి 76 శాతం. అతి త్వరలోనే మరికొన్ని జిల్లాలూ ఈ స్థితికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎ.పి.లో 688 మండలాలకుగాను 630 మండలాలు తీవ్ర వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి. సేద్యం సాధారణ విస్తీర్ణంలో 66 శాతమే జరిగింది. సీజన్‌ ‌ముగియడానికి ఇంకా పాతిక రోజులే ఉంది. ఈ పూర్వరంగంలో 20-25 లక్షల ఎకరాల్లో సాగు లేక బీడు పడటం ఖాయంగా కనిపిస్తోంది. సాగైన లక్షల ఎకరాల్లో పంటలకు సైతం నీటి గండం పొంచి ఉంది. చాలా చోట్ల పంటలు ఎండుతున్నాయి. భారీగా దిగుబడులు తగ్గనున్నాయి. రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు తెచ్చిన కృష్ణా డెల్టాలో వరి సాగుపై ప్రభుత్వం సృష్టించిన గందరగోళం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలను వినియోగించాలని ప్రభుత్వం ప్రతిపాదించినా శ్రీశైలంలో తెలంగాణ, ఎ.పి. పోటీపడి విద్యుదుత్పత్తి చేసి దిగువకు నీళ్లొదిలాయి. రాయలసీమకు తాగునీటి అవసరాలకు నీరు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం చుక్కనీరు విడుదల చేయలేదు. వెలిగొండ తొలిదశ ప్రారంభోత్సవానికి కొన్ని నీటిని ఇచ్చారంతే. రాష్ట్రంలో 20 వేల హేబిటేషన్లుండగా 15 వేల హేబిటేషన్లలో తాగునీటి ఇబ్బంది రావొచ్చని కేబినెట్‌‌లో అంచనా వేశారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో రెండు మూడు రోజులకోమారు తాగునీరిస్తున్న దశలో భవిష్యత్తు సహజంగానే భయపెడుతుంది. కరువొచ్చినప్పుడు బావులు తవ్వడం మొదలుపెట్టినట్టు కాకుండా ముందుగానే ప్రజలకు రక్షిత తాగునీటిని అందించే ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. కరువొచ్చిందంటే పశువులకు తాగునీరు, మేత, విద్యుత్‌ సమస్య ముందుకొస్తుంది. తగిన ముందస్తు చర్యలు చేపట్టాలి. కూలీలకు పనులుండవు. ప్రత్యేకంగా ఉపాధిహామీ పనులు చేపట్టి ఆదుకోవాలి. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి. బీమా అయోమయం ఉండనే ఉంది. వీలున్న ప్రతి అంగుళం భూమిలోనూ ఏదో ఒక పంట పండించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలి. రబీ కోసం సన్నద్ధమవ్వాలి. వీటన్నింటికీ నిధులు కావాలి. హుదూద్‌‌ మొదలుకొని బుడమేరు, మొంథా వరకు ఏనాడూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి సాయపడింది లేదు. డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కారుగా పేర్కొంటున్నందున ఎల్‌‌నినో సహాయం కోసం కేంద్రంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసి నిధులు సాధించాలి. జలహారతులు, లేఖలు కంటి తుడుపే తప్ప ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్