మృతి చెందిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్
ప్రజాశక్తి- కళ్యాణదుర్గం టౌన్ : కరువు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వానికి పట్టవా? అని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ ,సిఐటియు మండల కార్యదర్శి రంగనాథ్‌తో కలిసి ప్రభాకర్‌రెడ్డి గురువారం పరామర్శించారు. కళ్యాణదుర్గం మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలోని గొల్ల గోవిందు అనే రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
టమోటా, వేరుశనగ పంటల సాగు కోసం బోర్లు వేసి రూ. 16 లక్షల వరకు అప్పుల పాలయ్యామని, అప్పుల భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గోవిందు భార్య మమత, మృతుని తండ్రి జాలప్ప కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే మండల పరిధిలోని దాసంపల్లిలో శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శిం చారు. ఆరు ఎకరాల పొలంలో తొమ్మిది బోర్లు వేసిన నీరు పడలేదనీ, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలకు దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక అప్పుల పాలమయ్యామని వాపోయారు. సుమారు రూ.28 లక్షలు అప్పులు తీరే మార్గం లేక కుటుంబ పెద్ద ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీర య్యారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘మేము ఉన్నాం ,అధైర్య పడకండి ,ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి’ అని దైర్యం ఇచ్చే పరిస్దితుల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో తాగు, సాగు నీటి వసతికి చర్యలు చేపట్టాలని కోరారు. లక్ష కోట్లతో ఉద్యాన హబ్ సృష్టిస్తామని ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప జిల్లాలో ఎక్కడా అలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్ధానిక ఎమ్మెల్యే ,అధికార యంత్రాగం స్పందించి రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులతోపాటు రైతులు, తలారి మంజు, నరసింహులు, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)