గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజమండ్రి బార్ భవన నిర్మాణంపై యథాతథస్థితి

54 నిమిషాల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 11:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హైకోర్టు స్పష్టం

ప్రజాశక్తి-అమరావతి : రాజమండ్రి బార్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణం హైకోర్టు ఆమోదించిన ప్రణాళికకు అనుగుణంగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు భవన నిర్మాణానికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆమోదించిన ప్లాన్‌లో వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించగా, అందుకు భిన్నంగా నిర్మాణం చేపట్టడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణం ప్రారంభించకముందే సవరించిన ప్లాన్‌కు ఎందుకు అనుమతి తీసుకోలేదని బార్ అసోసియేషన్ బిల్డింగ్ కమిటీ కన్వీనర్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిటీ కన్వీనర్ సిహెచ్ ప్రభాకరరావును ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తూర్పుగోదావరి జిల్లా కోర్టు సముదాయ ప్రాంగణంలో హైకోర్టు, జిల్లా కోర్టుల నుంచి పరిపాలనపరమైన, సాంకేతిక అనుమతులు పొందకుండానే సుమారు 600 చదరపు గజాల్లో రాజమండ్రి బార్ అసోసియేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ధవళేశ్వరానికి చెందిన న్యాయవాది వల్లూరి సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. అనధికార నిర్మాణాన్ని తొలగించేలా ఆదేశించాలని, భవన నిర్మాణం కోసం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి సేకరించిన విరాళాలు, చేసిన ఖర్చులు, రసీదులు, బిల్లుల వివరాలను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని కోరారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని, తక్షణం స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. బిల్డింగ్ కమిటీ కన్వీనర్ తరఫు న్యాయవాది ప్రభల రాజశేఖర్ స్పందిస్తూ భవన నిర్మాణం 80 శాతం పూర్తయిందని, సవరించిన బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం హైకోర్టుకు సమర్పించామని తెలిపారు. ఇంతకు ముందే సవరించిన ప్లాన్‌కు అనుమతి ఎందుకు తీసుకోలేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్