mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'అయోధ్య' నిధుల దుర్వినియోగం పాలనారాహిత్యం కాదా?

2 గంటల క్రితం

cpi ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 06:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : అయోధ్య రామాలయంలో రూ. 200 కోట్ల దొంగతనం జరిగిందని, దీనిపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ఆదివారం సూళ్లూరుపేట లో జరిగిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి విరాళాలుగా సేకరించిన రూ. 1400 కోట్ల లెక్కలు, ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం దాని విలువ రూ. 1,67,000 కోట్లకు పైగా ఉంటుందని, కానీ దానికి సరైన రశీదులు లేదా లెక్కలు లేవని విమర్శించారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు, అయోధ్య రామాలయం నిధుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై సిట్ (SIT) తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకానికి నిధుల కోత విధించి, రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్రం 60% నిధులు భరించేలా నిబంధనలు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పాత పద్ధతిలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఏ ఒక్కరి సొత్తు కాదని, దానిని అందరికీ హక్కు ఉండేలా 'ఫ్రీ జోన్' గా ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వాలు నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణను ప్రశ్నించారు. వెంటనే ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, బీర్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయని, సాక్షాత్తు ఎమ్మెల్యేలు 10% నుండి 30% వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని, సంసారాలను పణంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం చూడటం దారుణమన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను తాము 'విశ్వగురువు'గా ప్రకటించుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని విమర్శించారు.

సీబీఎస్ఈ (CBSE) ప్యాట్రన్ దెబ్బతినడం, నీట్ (NEET) పరీక్షా పత్రాలు లీక్ కావడం వల్ల దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, మహారాష్ట్ర టెట్ (TET) పేపర్ కూడా లీక్ అయిందని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ 'ఎడ్యుకేషన్ మాఫియా' నడుస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దళితులు, ఆదివాసీలు మరియు ప్రతిపక్ష పార్టీ (వైసీపీ) కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో వైసిపి కార్యకర్త హత్య, పోలీస్ లాకప్‌లలో దళితుల (క్రాంతి కుమార్, గంగమ్మ తదితరులు) మరణాలు, ఆత్మహత్యలు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి చేనేత సంఘం నాయకులు మోదుగుల పార్థసారథి సూళ్లూరుపేట మండల కార్యదర్శి రమణయ్య పట్టణ కార్యదర్శి ఆనంద్ సహాయ కార్యదర్శులు బాలు లక్ష్మి వెంకట కృష్ణయ్య చంచమ్మ ఎఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు శ్రీనివాసులు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్