శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిఎస్‌ఎల్‌‌వి-ఎఫ్ 17 సక్సెస్‌

1 గంట క్రితం

ISRO's success is a source of great pride for the nation: Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- సూళ్లూరుపేట రూరల్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు జిఎస్‌ఎల్‌‌వి-ఎఫ్ 17 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. 2,367 కిలోల బరువున్న ఇఒఎస్‌ 05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని నిర్దేశిత ఉప ‌భూస్థిర బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 27 గంటల కౌంట్ డౌన్ అనంతరం స్వల్ప వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దీనిని ప్రయోగించారు. ఉపగ్రహ సౌర ఫలకాలు విజయవంతంగా విచ్చుకున్నాయి. అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రానున్న రోజుల్లో కక్ష్యను క్రమంగా పెంచి ఇఒఎస్‌ 05ను తుది భూస్థిర కక్ష్యలోకి చేర్చనున్నారు. భూస్థిర కక్ష్య నుంచి చిత్రీకరణ చేసే భారత తొలి చిత్రీకరణ ఉపగ్రహంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. కక్ష్యను క్రమంగా పెంచిన అనంతరం సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇది పనిచేయనుంది. ఇప్పటివరకు భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ ఎత్తు కక్ష్యల్లో భూమి చుట్టూ తిరుగుతూ వివిధ ప్రాంతాలను విడతలవారీగా పరిశీలించగా, ఇఒఎస్‌ 05‌ను విస్తారమైన ప్రాంతాన్ని నిరంతరం గమనించే సామర్థ్యంతో ప్రత్యేకంగా రూపొందించారు. భూమిపై జరుగుతున్న పరిణామాలను మరింత వేగంగా గుర్తించి, అవసరమైన సమాచారాన్ని దేశానికి అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగంలో పంటల పరిస్థితిని పర్యవేక్షించడం, వర్షాభావం, అధిక వర్షాల ప్రభావాన్ని అంచనా వేయడం, వరదలు, తుపాన్ల సమయంలో ప్రభావిత ప్రాంతాలను త్వరగా గుర్తించడం, అటవీ ప్రాంతాలు, నీటి వనరుల్లో మార్పులను గమనించడం వంటి అనేక అవసరాలకు ఈ ఉపగ్రహం నుంచి లభించే చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించడంతోపాటు, దేశ వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించగలగడం ఈ ఉపగ్రహం ప్రత్యేకత. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల ప్రయోగ బరువుతో మూడు దశల్లో సాగిన జిఎస్‌ఎల్‌‌వి-ఎఫ్17లో అత్యంత కీలకమైన క్రయోజెనిక్ దశను విజయవంతంగా పూర్తి చేసి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడంతో షార్ లో ఆనందోత్సాహాల నడుమ పండగ వాతావరణం నెలకొంది. జిఎస్‌ఎల్‌‌వి ద్వారా భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లో 2,367 కిలోల ఇఒఎస్‌ 05 అత్యంత భారీది. 2021లో ఇఒఎస్‌ 03ను మోసుకెళ్లిన జిఎస్‌ఎల్‌‌వి-ఎఫ్ 10 ప్రయోగం క్రయోజెనిక్ పైదశలో ఏర్పడిన లోపం కారణంగా విఫలమైన నేపథ్యంలో తాజా విజయం ఇస్రోకు మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీహరికోట నుంచి జరిగిన ప్రయోగాల పరంపరలో ఇది 106వది.

శాస్త్రవేతలను అభినందించిన ప్రధాని మోడీ

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ... ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఇది భారతదేశపు పెరుగుతున్న అంతరిక్ష సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్