బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆలయ భూముల కౌలు రైతులు, సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి

1 గంట క్రితం

koulu raithu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రాష్ట్ర సదస్సు డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆలయాల భూములు సాగుచేస్తున్న కౌలు రైతులు, సాగురైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్‌ ‌చేశారు. సంఘం ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబివికెలో బుధవారం నిర్వహించిన ఆలయ భూముల కౌలుదారుల, సాగురైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌‌నినోతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో ఆలయ భూములకు ముందుకుగా వసూలు చేసిన కౌలును రైతులకు చెల్లించాలన్నారు. పంటలు వేయని భూములకు కౌలు రద్దు చేయాలని, మరో ఏడాది పంట వేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.67 లక్షల ఎకరాల ఆలయ భూములను లక్ష మంది కౌలుదారులు, సాగు రైతులు ఎంతో శ్రమకోర్చి సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూముల సాగువల్ల కౌలు రైతులు కష్టాలు తీరకపోగా, నష్టాలతో అప్పుల పాలవుతున్నారని చెప్పారు. ఆలయ భూములకు యాజమాన్యమైన ప్రభుత్వం.. రైతుల నుంచి ముక్కుపిండి కౌలు మొత్తాన్ని బలవంతంగా వసూలు చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరామ్‌ మాట్లాడుతూ.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నూతన కౌలు చట్టాన్ని వెంటనే తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో సాగుదారులైన కౌలు రైతులు, సన్న, చిన్న కారు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన ఆలయ భూములను గుర్తించి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు, దశాబ్దాల తరబడి సాగుచేస్తున్న సాగు రైతులపై సరైన వైఖరి తీసుకొని వారికి అన్ని హక్కులు, రక్షణ కల్పించాలని కోరారు. కౌలుదారులకు అన్ని పంటలకూ అవసరమైన ఎరువులను, పురుగు మందులు, విత్తనాలు సబ్సిడీపై అందించాలని, పంటల బీమా అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఎపి రైతు సంఘం ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉందన్నారు. దీంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడుతూ.. కౌలుదారులు, సాగురైతుల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. పేద మహిళా రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర సదస్సు ఆలయ భూముల కౌలు రైతులకు సంబంధించి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజన్, శ్రీను నాయక్, విజయ్ కుమార్‌‌ వివిధ అంశాలపై కౌలుదారులు, సాగు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై రాధాకృష్ణ, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ‌వెంకట్రావు, కెవిపిఎస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తదితరులు ప్రసంగించారు. సదస్సులో ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు పంచకర్ల రంగారావు, తాళ్లూరి గోపాల్‌, రెడ్డి వేణు, కందుల శ్రీనివాసరావు, ఎర్రమ్మ, వెంకటేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్