ప్రజల విశ్వాసంతోనే 25 ఏళ్ల ప్రస్థానం
‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధించితీరుతాం
ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రజల విశ్వాసంతోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల నిరంతర ప్రస్థానం సాధ్యపడిందని, తన జీవితంలో ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి 2001 అక్టోబర్ 7న పదవీ స్వీకార ప్రమాణం చేసి పలు పర్యాయాలు ముఖ్యమంత్రిగానూ, అనంతరం 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు పర్యాయాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఈ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా బుధవారం నాడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’లో ఆయన ప్రసంగించారు. ప్రజల ఆశీస్సులే తనను ఇంతకాలం నడిపించాయని, గుజరాత్ సిఎంగా ప్రమాణం చేసినప్పుడు.. 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ అందిస్తానని ఊహించలేదన్నారు. ప్రజా సేవలో ఉన్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకుంటే.. ముందుకు వెళ్లలేమన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించి తీరుతామన్నారు. ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సాధ్యమేనని, అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ.. ఇలాంటివన్నీ సాధ్యమేనని, ప్రపంచ మంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని గొప్పలు చెప్పారు. తన జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన ఏదో ఒక విషయాన్ని నేర్పిందన్నారు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించానని, తాను నిత్య విద్యార్థినని మోడీ చెప్పుకొచ్చారు. అంతుకు ముందు 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని సరొజినీ నగర్‌లో ఉన్న వినాయక మందిరంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు. బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీతోనూ మోడీ సమావేశమై ఆయన ఆశ్సీసులు పొందారు. కాగా 25 ఏళ్ల సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగిన ప్రధాని మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో పేర్కొనగా..ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
-







కామెంట్‌లు (0)