పర్యావరణ ప్రభావంపై నిపుణుల కమిటీ నియమించాలి.
అమరావతి : విశాఖపట్నం రూరల్ మండలం అడవివరం, ముడుసర్లోవ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తుది తీర్పు వచ్చే వరకు డేటా సెంటర్ ప్రాజెక్టులో సొంత రిస్క్‌తో పనులు చేపట్టాలని కోర్టు చెప్పినందున ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇన్సెంటీవ్‌లను ఉపసంహరించుకోవాలని అన్నారు. జనావాసాల మధ్య డేటా సెంటర్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, దీనికనుగుణంగానే ప్రభుత్వ చర్యలుండాలని సూచి ంచారు. దీంతో పాటు అన్ని రకాల సహాయాన్ని తక్షణం నిలిపివేసి ప్రజా ధనాన్ని కాపాడాలని కోరారు. పెట్టుబడులు పెట్టామన్న కారణంతో భవిష్యత్‌లో ఎలాంటి హక్కులు కోరడానికి ప్రాజెక్టుకు వీలులేదని కోర్టు స్పష్టంగా పేర్కొందని అన్నారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనతో పాటు, నీరు, భూమి, ఇతర పర్యావరణ ప్రభావాలపై వెంటనే ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ వేసి నిర్ధిష్టంగా అంచనా వేయాలని, ఆ నివేదికలకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచి ంచారు. ఆ వివరాలను బహిరంగ పరచి ప్రజలకు తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. డేటా సెంటర్ నిర్మాణంపై ఇప్పటికే అనేక మంది నిపుణులు, పుర ప్రముఖులు, విశాఖపట్నం నగర ప్రజలు అనేక సందేహాలను లేవనెత్తారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ ప్రభావంపై ప్రభుత్వం స్పష్టమైన అంచనాకు రావాలని అన్నారు. భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలపై ప్రభుత్వం పోలీసు నిర్బంధం ప్రయోగించి, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కేంద్రీకరించి ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోందని అన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సింహాచలం దేవస్థానం కేసులను ఉపసంహరించుకొని పంచ గ్రామాల ప్రజల భూములకు పూర్తి హక్కులివ్వాలని అన్నారు. ఇప్పటికైనా గ్రామసభలు జరిపి ప్రజాభిప్రాయాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
డేటా సెంటర్ నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలి : వి.శ్రీనివాసరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026, 04:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)