బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసర్కారు బడికి పొగ!

1 గంట క్రితం

WhatsAppImage20261007at31708PM7-1791379778266-6997.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 12:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మరిన్ని ప్రైవేటు పాఠశాలలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

  • అరకొర ఆంక్షలు సైతం ఎత్తివేత

  • విదేశీ విద్యాసంస్థల*కోసం పాలసీ

  • మంత్రివర్గ సమావేశ నిర్ణయం

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రైవేటు పాఠశాలల్లో విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, దానిని నియంత్రించడానికి బదులుగా వాటి ఏర్పాటుకు ఉన్న అరకొర నిబంధనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఇది ప్రభుత్వ బడులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఒక ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేయాలంటే ఆ ప్రాంతంలో సర్వే చేయాలి. అప్పటికే అక్కడ బడి ఉందా? ఉంటే ప్రభుత్వ పాఠశాల ఉందా, ప్రైవేటు పాఠశాల ఉందా అన్న వివరాలు సేకరించాలి. విద్యార్థులు ఎందరున్నారు? అప్పటికే బడి ఉంటే, మరో సంస్థ అవసరం ఉందని నిరూపిస్తూ దానికి సంబంధించిన గణాంకాలు సమర్పించాలి. పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను కూడా ముందుగానే ప్రకటించాల్సి ఉంది. ఈ నిబంధనల కారణంగా పూర్తిస్థాయిలో కాకున్నా కొంత మేరకైనా విచ్చలవిడిగా ప్రైవేటు విద్యాసంస్థల ఏర్పాటును కట్టడి చేయడం సాధ్యమవుతోంది. తాజాగా ఈ నిబంధనలన్నింటిని తొలగిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యా చట్టం, 1982లో 20(1), 20(2), 20(3),(ఎ), (ఐ), 33-బి(1), 33(2) సెక్షన్లను సవరించేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేబినెట్‌ ‌నిర్ణయాలను మీడియాకు సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీరెగ్యులేషన్‌ అండ్‌ కంప్లయన్స్‌ రిడక్షన్‌ కార్యక్రమం రెండో దశలో భాగంగా ఈ మార్పు చేస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు రాష్ట్ర నిబంధనలను కూడా విద్యా హక్కు చట్టం-2009కు అనుగుణంగా మారుస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా విదేశీ ఉన్నత విద్య సంస్థలు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, పెట్టుబడులు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం-2026 రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో క్యాంపస్‌‌లను ఏర్పాటు చేసుకునేందుకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు, ఉన్నత విద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

విధుల్లో మరణించిన ఆశాలకు గ్రాట్యుటీ

విధుల్లో మరణించిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఏడాదికి రూ.5 వేల చొప్పున గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించేందుకు ప్రతిపాదనను ఆమోదించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలుకు రూ.2.19 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించామని, అదనంగా 66 పోస్టులను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదనకు ఆమోదించామని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద

సర్కారు బడికి సెలవేనా?

ఈ ఏడాది మరో 58,601 మంది అర్హత కలిగిన విద్యార్థులను లబ్ధిదారుల కింద సహాయం విడుదలకు ఆమోదం తెలిపామన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

రెండో దశలో ఎంపికైన 3,29,201 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం విడుదలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని, దీంతో లబ్ధిదారుల సంఖ్య 68,05,791కి చేరిందని వివరించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు డైట్‌ ఛార్జీలను 10 శాతం పెంచి అన్ని సంక్షేమ శాఖలకు ఒకే ధరను అమలు చేసేందుకు ఆమోదం తెలిపామని చెప్పారు. విశాఖపట్నంలోని మరికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు జారీ చేసిన జిఓ 69కు ఆమోదం తెలిపామన్నారు. ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎపిహెచ్‌ఐఎంఎస్‌)‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ఇళ్ల స్థలాల కోసం మంత్రుల కమిటీ

ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వద్దనుకుని వదిలేసిన రిజిస్టర్డ్‌ స్థలాలను రద్దుచేసి అర్హులైన వారికి కేటాయించే అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. ఆవాస్ సర్వేలో 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కావాలని గుర్తించారని, వీరికి భూ సేకరణ ఎలా చేయాలనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రివర్గం అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌ కెఎస్‌‌వి విశ్వనాథన్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్