- సిజెపి నాయకుడు ఆశుతోష్ రంకాపై దాడిని ఖండించిన ఎస్‌ఎఫ్‌ఐ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన సిజెపి అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా, కార్యకర్తలపై జరిగిన దాడిని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి వెళ్లిన ఆశుతోష్ రంకా, సిజెపి బృందంపై దాడి చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేయడం ఆందోళనకరమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి, వాటిని ప్రజల దృష్టికి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉన్న హక్కు అని తెలిపారు.ప్రజా సమస్యలపై ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వారు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని విమర్శించారు. గతంలో పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల పరిస్థితులపై వీడియో తీసి ప్రజల దృష్టికి తీసుకువచ్చిన అబ్దుల్ తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ దాడి వెనుక బిజెపికి చెందిన వ్యక్తులున్నారని సిజెపి ఆరోపించిందని, దాడి వెనుక ఎవరున్నా వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం ప్రశ్నించే వారిపై దాడులను అరికట్టి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరారు.







కామెంట్‌లు (0)