తేల్చి చెప్పిన హైకోర్టు
ప్రజాశక్తి – అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఇందుకు ఎంత బడ్జెట్ అవసరమవుతుంది, ఎప్పుడు నిధులు విడుదల చేస్తారనే వివరాలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. కోర్టుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడేళ్లు గడిచినా వాటిని అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కఠిన ఆదేశాలు జారీ చేసే పరిస్థితిని తీసుకురావొద్దని ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిసి కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఈ విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.







కామెంట్‌లు (0)