ఐసెన్‌కోట్ కూటమికి స్వల్ప ఆధిక్యం
జెరుసలాం: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీకి గానీ, మాజీ సైనిక దళాల చీఫ్ గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యాషర్ పార్టీకి గానీ సంపూర్ణ మెజారిటీ దక్కడం లేదు. నెతన్యాహూ పార్టీ బలం తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో 85 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కుడిపక్ష కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే, 120 స్థానాల పార్లమెంటులో మెజారిటీకి అవసరమైన 61 స్థానాలను సాధించే పరిస్థితి కనిపించడం లేదు. నెతన్యాహు కూటమికి 53, గాడి ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు వస్తాయని అంచనా. తుది ఫలితాల్లో మార్పులు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష యాషర్‌కు అనుకూలంగా రావడంతో టెల్ అవివ్‌లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. ‘‘బీబీ గో హోమ్’’ అంటూ నినాదాలు చేశారు. అరబ్ మెజారిటీ ఉన్న జాయింట్ లిస్ట్ నాయకుడు యూసుఫ్ జబరీన్ మాట్లాడుతూ, నెతన్యాహు ప్రభుత్వానికి నిజమైన ప్రత్యామ్నాయం చూపాలనుకునే వారు తమతో మాట్లాడాల్సిందేనన్నారు. మరోవైపు, ప్రతిపక్ష కూటమి నేత ఐసెన్‌కాట్ అరబ్ పార్టీలతో పొత్తుపై ఇప్పటివరకు విముఖత చూపారు. అయితే, ఆయన కూటమిలోని వామపక్ష నాయకుడు యైర్ గోలన్ అరబ్ పార్టీలతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అరబ్ ఎంపీలు నేరుగా ప్రభుత్వ కూటమిలో చేరకుండా, పార్లమెంటులో అవసరమైనప్పుడు ఐసెన్‌కాట్‌కు మద్దతివ్వడం ద్వారా మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అలాంటి ప్రభుత్వం ఎక్కువకాలం నిలదొక్కుకోవడం కష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. చర్చలు విఫలమైతే కొత్త ఎన్నికలకు వెళ్లే అవకాశమూ ఉంది.







కామెంట్‌లు (0)