- మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ధర్నా
- ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
- విశాఖ, పాడేరుల్లో పలువురు అరెస్టు
ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం): ప్రభుత్వ మాటతప్పడం సరికాదని, ఇచ్చిన హామీ ప్రకారం గిరిజన గురుకుల పాఠశాలను మారికవలసలోనే యథావిధిగా కొనసాగించాలని, జిఒ 69ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రెండో రోజూ ఆందోళన కొనసాగింది. మారికవలస గిరిజన గురుకుల బాలుర ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద సోమవారం కూడా ధర్నా చేశారు. చిరుజల్లు పడుతున్నా లెక్క చేయకుండా ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిపిఎం, వైసిపి నాయకులు పాల్గొన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, జడ్‌పి చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, సిపిఎం మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులన్నా, వారు చదువులన్నా కూటమి ప్రభుత్వానికి లెక్కలేకుండా ఉందని విమర్శించారు. ఒక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం రెండు గిరిజన గురుకులను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులను అర్ధరాత్రి హుటాహుటిన తరలించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వివిధ పాఠశాలలకు తరలించిన ఇక్కడి విద్యార్థులను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మారికవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చి పాడేరు నుంచి వెనక్కి తీసుకొచ్చిన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి వెంటనే స్పందించి గిరిజన బిడ్డలకు న్యాయం చేయకపోతే రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు, తల్లిదండ్రుల ఆధ్వర్యాన ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి మాజీ చైర్మన్ శోభ స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎస్ఎఫ్ఐ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విశాఖలో అప్పలనర్స అరెస్ట్
ధర్నాకు మద్దతు తెలిపేందుకు పాడేరు నుంచి వస్తున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్సను మార్గమధ్యలో పోలీసులు అరెస్టు చేసి విశాఖ నగరంలోని మధురవాడ స్టేషన్‌కు తరలించారు. సిఐటియు విశాఖ మధురవాడ జోన్ నాయకులు రాజకుమార్‌ను ఆయన ఇంట్లో అరెస్టు చేసి అదే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అధికారులు ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో తిరిగి ఆందోళనకు సిద్ధమైన గిరిజన సంఘం నాయకులు ధర్మన పడాల్, బాలదేవ్, దాసు, స్పెషల్ డిఎస్‌సి సాధన కమిటీ జిల్లా నాయకులు భాను సిహెచ్ రావు, ఎస్ఎఫ్ఐ నాయకులు కార్తీక్‌ను పాడేరులో పోలీసులు అరెస్టు చేశారు.








కామెంట్‌లు (0)