ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాయలసీమలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను రాజకీయ ప్రయోజనాలకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రయోజనాలను ఏనాడూ పట్టించుకోని జగన్, ఇతర వైసిపి నాయకులు ఇప్పుడు కరువును అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.13,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని, రూ.10,014 కోట్లు ఈ బడ్జెట్ లో ఖర్చు చేస్తున్నామన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పెట్టిన రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 365 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 198 ప్రాజెక్టులను ప్రీ-క్లోజర్ చేస్తే... అందులో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని తెలిపారు. హంద్రీనీవా విస్తరణ, వేదవతి, గుండ్రేవులు, హెచ్‌ఎల్‌సి కాలవ ఆధునీకరణ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేయడం రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమని తెలిపారు. హంద్రీనీవాకు ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో రూ.3,850 కోట్లు ఖర్చు పెట్టామని, ఈ ఏడాది మరో రూ.1,180 కోట్లు కేటాయించనున్నామన్నారు. జగన్ రద్దు చేసిన మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు, ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని 12 రాష్ట్రాలు, 315 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకున్నాయని,ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని తెలిపారు. 2027 జులై వరకు తాగునీటి అవసరాలకు నీరు నిల్వ చేస్తున్నామన్నారు. కష్టకాలంలో రాజకీయాలు కాకుండా రైతులకు, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.








కామెంట్‌లు (0)