ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యారంగ పరిరక్షణకు ఉమ్మడి కృషి

11 జులై, 2026

jvv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 01:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- శాస్ర్తీయ దృక్పథానికి హాని కలిగించే విధానాన్ని ప్రతిఘటించాలి

- ‘స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అసెంబ్లీ’లో వక్తలు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నేడు విద్యపై జరుగుతున్న దాడులను ఏ ఒక్క సంస్థే ఎదుర్కొడం సాధ్యంకాదని, విద్యను పరిరక్షించడానికి అన్ని సంస్థలూ ఉమ్మడిగా పనిచేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. శాస్త్రీయ దృక్పథానికి హాని కలిగించే నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) - 2020లోని అంశాలను ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన విశాఖ కంచరపాలెంలోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌కెమికల్‌ ఇంజనీరింగ్‌‌లో రెండు రోజులపాటు తలపెట్టిన స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అసెంబ్లీ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ద్రవిడ యూనివర్శిటీ పూర్వ వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌ప్రొఫెసర్‌ ‌కెఎస్‌ చలం మాట్లాడుతూ విద్యను మార్కెట్‌ ‌సరుకుగా పాలకులు మార్చేశారని అన్నారు. మనది మార్కెట్‌ ఆధారిత ప్రజాస్వామ్యంగా మారిందన్నారు. విదేశీ యూనివర్శిటీలకు ఆహ్వానం పలుకుతున్నారని, జిడిపిలో కేటాయింపులు పెంచి అందరికీ విద్యావకాశాలు కల్పించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించేలా ఒత్తిడి తేవాలని డిమాండ్‌ ‌చేశారు. విశిష్ట అతిథి కేరళ ఎడ్యుకేషన్‌ ‌ఫోరం ప్రతినిధి పద్మనాభన్‌ చంద్రోత్‌ ‌మాట్లాడుతూ మతోన్మాద పెడధోరణులు విద్య శాస్త్రీయ, లౌకిక పునాదులను ధ్వంసం చేశాయని తెలిపారు. జాతీయత, దేశభక్తి పేరుతో వీటిని అమలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రజలు ఈ భావజాలానికి గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఎన్‌ఇపి 2020లో శాస్త్రీయ దృక్పథానికి హాని కలిగించే అంశాల కేంద్రంగా చర్చలు జరగాలని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్సీ, జెవివి రాష్ట్ర అధ్యక్షులు కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ మానవ జీవితంలో విద్య ప్రధాన అంశమని, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఏ విద్యా కమిషన్‌ కూడా మౌలిక సమస్యలకు పరిష్కారం చూపలేకపోయాయని తెలిపారు. ఎన్‌ఇపి అమలుతో తలెత్తిన పరిస్థితులను చర్చించడానికి ఈ అసెంబ్లీ జరుగుతోందన్నారు.

ఈ రెండురోజుల్లో ఒక డిక్లరేషన్‌ ‌విడుదలవుతుందన్నారు. ప్రారంభ సమావేశం అనంతరం పాఠశాల విద్య, ఉన్నత విద్యపై ప్రత్యేక సమావేశాలు జరిగాయి. డిగ్రీ విద్యలో సంభవిస్తున్న పరిణామాలపై రాజగోపాల్‌, వికసిత్‌ ‌భారత్‌ ‌శిక్షా అధిస్తాన్‌ ‌బిల్లుపై ఆలిండియా సేవ్‌ ఎడ్యుకేషన్‌ ‌రాష్ర్ట ఉపాధ్యక్షులు గోవిందరాజులు పత్రాలు సమర్పించారు. ఈ అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌గేయానంద్‌, జెవివి ఉన్నత విద్య రాష్ర్ట కన్వీనర్‌ ‌డాక్టర్‌ ఎన్‌ చంద్రశేఖర్‌, రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుంచి 200 మంది ప్రతినిదులు పాల్గొన్నారు. ‘పిల్లలు వర్థిల్లాలి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్