బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​ కొనసాగిన జూనియర్‌ డాక్టర్ల సమ్మె

1 గంట క్రితం

jr dr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 10:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేత

  • ఒంగోలులో వైద్యులకు సెలవులు రద్దు

ప్రజాశక్తి - యంత్రాంగం : స్టైఫండ్ పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె బుధవారమూ కొనసాగింది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలనూ నిలిపివేశారు. గుంటూరులో జూనియర్‌ ‌వైద్యులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలో వైద్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని అసోసియేషన్‌ అధ్యక్షులు ఈశ్వర్‌ ‌శంకర్‌, ప్రధాన కార్యదర్శి బి. దినకర్‌ ‌సాయిశ్రీనివాస్‌ ‌తెలిపారు. కాకినాడలోని జిజిహెచ్ ఆర్ఎం సి హాస్టల్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.రమేష్ మాట్లాడుతూ... మంగళవారం ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే స్టైఫండ్ పెంపు ఎనిమిది నెలలు ఆలస్యం అయిందన్నారు. విశాఖ కెజిహెచ్‌‌ ప్రాంగణంలో జూనియర్‌ డాక్టర్లు బైఠాయించారు. సమ్మెకు ఎపి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్ మద్దతు తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదుట ఇంటర్నల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్స్ విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారులు అప్రమత్తమయ్యారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు జి జి హెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ ఎస్ మాణిక్య రావు తెలిపారు. వైద్యులకు సెలవులు రద్దు చేయడమే కాకుండా, సెలవులో ఉన్న వారిని వెనక్కి పిలిపించామని తెలిపారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ జిజిహెచ్‌ ప్రాంగణంలో రిలేదీక్షలు చేపట్టారు. సుమారు 300 మంది జూడాలు సాధారణ సేవలను బహిష్కరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. సాధారణ వార్డుల్లో విధులు బహిష్కరించడంతో రోగులకు సేవల్లో అంతరాయం కలగకుండా ట్యూటర్లు, సర్వీసు పీజీలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు.

చర్చలు జరుపుతున్నాం : మంత్రి సత్యకుమార్‌

స్టైఫండ్‌ పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరుపుతున్నామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణతో పోల్చుకోవటం సరికాదన్నారు. కేరళ, తమిళనాడు కంటే మన రాష్ర్టంలో జూనియర్‌ డాక్టర్లకు స్టెఫండ్‌ ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు. పిజి విద్యార్థులతో పోల్చుకుంటే ఇంటర్న్స్‌‌కి తక్కువ స్టైఫండ్‌ ‌వస్తున్న మాట వాస్తవమేనన్నారు. ఇంటర్న్స్‌‌కి ఎంత ఇవ్వాలి,? పిజి, సీనియర్‌ ‌రెసిడెంట్స్‌, సూపర్‌ ‌స్పెషాలిటీలకు ఎంత పెంచాలనేది చర్చిస్తున్నామన్నారు. మధ్యే మార్గంగా ఒక ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నామని తెలిపారు. జూనియర్‌ డాక్టర్లతో మంత్రి చర్చలు జరపడం లేదనే ప్రచారం వాస్తవం కాదని, తన కార్యాలయంలో స్వయంగా చర్చలు జరిపానని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్