స్టైపండ్ పెంపు, క్రమబద్ధీకరించాలని డిమాండ్
పలు ఆస్ప్రతుల్లో ఒపి సేవలు నిలిపివేత
హామీలు అమలు చేయకుంటే ఉద్యమం ఉధృతం : ఎపి జూడా హెచ్చరిక
ప్రజాశక్తి - యంత్రాంగం : స్టైపండ్ పెంపును వెంటనే విడుదల చేయాలని, నెలనెలా చెల్లింపులను క్రమబద్ధీకరించాలని, ఎన్ఎంసి నిబంధనలను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పలు ఆస్పత్రుల్లో ఒపి సేవలను బహిష్కరించి నిరసన తెలిపారు. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం హాజరయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలు అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఎపి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు.
గుంటూరు మెడికల్ కాలేజీ, ఇంటర్న్‌లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సూపర్‌స్పెషాలిటీ పోస్ట్‌గ్రాడ్యుయేట్లు సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ సభ్యులతో కలిసి, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా సమ్మె చేస్తున్నట్టు అసోసియేషన్ నాయకులు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో పలు మార్లు చర్చించినా సానుకూల స్పందన రాకపోవడం వల్ల గత్యంతరం లేనిపరిస్థితుల్లో తాము సమ్మెకు పూనుకోవాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. తృప్తికరమైన పరిష్కారం లభించని పక్షంలో బుధవారం నుంచి శనివారం వరకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అత్యవసర , ఐసియు, శస్త్రచికిత్సలకు అంతరాయం కలగకుండా సేవలు కొనసాగుతాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యు.ఈశ్వర్ శంకర్, ప్రధాన కార్యదర్శి బలగం దినకర్ తెలిపారు.
విశాఖలో కెజిహెచ్‌తో పాటు నగరంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఒపి సేవలను బహిష్కరించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే తాము హాజరవుతామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. కడపలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లోని పలు విభాగాల్లో ఒపి సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మెడికల్, సర్జికల్, ఆర్థో, రేడియాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్, సైకియాట్రిక్, ఇఎన్‌టి, గ్యాస్ట్రోఎంటరాలజీ, సుశ్రుత భవన్ లో నిరసన కొనసాగించారు. కొన్ని విభాగాల్లో పిజి వైద్యులతో పని చేయించుకోవడాన్ని గమనించిన ఎపి జూడా నాయకులు ఆ విభాగల ముందు నిరసన వ్యక్తం చేసి సమ్మెకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఒపి, ఆపరేషన్ థియేటర్లలో సేవలను సంపూర్ణంగా నిలిపివేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆందోళన చేపట్టారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామలకు వినతిపత్రం అందజేశారు.







కామెంట్‌లు (0)