నెల్లూరులో ఐద్వా ర్యాలీ
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ధర్నా
ప్రాజెక్ట్ డైరెక్టర్ హామీతో విరమణ
ప్రజాశక్తి - నెల్లూరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి మహిళకు, నెలకు రూ.1,500, రుణమాఫీ, వడ్డీ మాఫీ, మహిళలకు నిరుద్యోగ భృతి లాంటి వాగ్దానాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ (ఐద్వా) నగర కమిటీ ఆధ్వర్యంలో ఎబిఎం కాంపౌండ్ సెంటర్ నుండి భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మెప్మా కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేశారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు కదిలేది లేదని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ధర్నా వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు. నెల రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ బీ, నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడుతూ పొదుపు మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, కేవలం బ్యాంకు లింకేజీ రుణాలు మాత్రమే ఇప్పించి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలకు కూడా అధిక శాతం వడ్డీలు విధిస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500, పది లక్షల రూపాయల వరకు రుణమాఫీ, వడ్డీ మాఫీ, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల నమోదు పేరుతో పొదుపు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. లక్ష మందికి పైగా నివసించే 53, 54 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పీడీ హామీతో ఆందోళన విరమించారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టకు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా నెల్లూరు రూరల్ కార్యదర్శి షేక్.షాహినా బేగం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి.అన్నపూర్ణమ్మ, నగర అధ్యక్షులు ఎన్.వి.సుబ్బమ్మ, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)