అత్యాధునిక సౌకర్యాల కల్పన కృషి
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా: మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని పేర్కొన్నారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ(కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్) మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 50 ‘102-తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 50 ఆధునిక వాహనాలను ప్రారంభించగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 300 సరికొత్త వాహనాలు ఒకేరోజు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాల్లో ఎసి, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఫుట్‌రెస్ట్, జిపిఎస్ ట్రాకింగ్, అత్యవసర ఎస్‌విఎస్ బటన్ వంటి సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102, అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు–చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి.. అవసరమైన సేవలను వీలైనంత వరకు వారి వద్దకే తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామన్నారు. యాంటీనాటల్ చెకప్‌లకు వెళ్లే గర్భిణులు 102 సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను ఆసుపత్రికి తరలించడంతోపాటు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, మరో రెండు నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంబులెన్సుల సంఖ్యను 602 నుంచి 733కు పెంచామని.. సుమారు 170 అధునాతన జీవనాధార సదుపాయాలున్న వాహనాలు ఉన్నాయని తెలిపారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ చేరే సమయాన్ని కూడా తగ్గించామని తెలిపారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్, నియోనేటల్ వార్డ్, హైటెక్ ల్యాబ్, ఫిజియోథెరపీ విభాగాలను మంత్రి ప్రారంభించారు.








కామెంట్‌లు (0)