మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యమకారులపై పోలీసుల వేధింపులు ఆపాలి : సిఐటియు

1 గంట క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిఐటియు రాజమహేంద్రవరం నాయకత్వంపై పోలీసులు వేధింపులకు పాల్పడటాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నరసింగరావు, ఎవి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ నెల 10న దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిర్వహించిన జైల్‌ భరో కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్‌ను అదే రోజు అర్ధరాత్రి అరెస్టు చేసేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కుపై పోలీసుల ద్వారా దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న దేశవ్యాప్తంగా జైల్‌ భరో నిర్వహించగా, రాష్ట్రంలో 100కు పైగా కేంద్రాల్లో కార్మికులు, కర్షకులు విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా, ఏళ్ల తరబడి కనీస వేతనాల సవరణ చేపట్టకపోవడం ద్వారా కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. కార్మికుల తరపున ప్రశ్నిస్తున్న కార్మిక సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేసులు, నిర్బంధాలతో సిఐటియు నాయకత్వాన్ని భయపెట్టాలని ప్రయత్నిస్తే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంపై టిడిపి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, లేకుంటే మరింత పెద్దయెత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే నాయకులపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్