శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్షం తగ్గినా ముంపు వీడని కాకినాడ

15 గంటల క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 06:05 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- 24 గంటలు గడిచినా ఇళ్లలో, వీధుల్లో మోకాళ్ల లోతు నీరు

- నిత్యావసరాలకు బయటకు రాలేక ప్రజల అవస్థలు

- పర్యటనలకే పరిమితమైన అధికారుల చర్యలు

ప్రజాశక్తి-కాకినాడ : వర్షం తగ్గి 24 గంటలు గడిచినా కాకినాడ నగరాన్ని ముంపు కష్టాలు వీడలేదు. అనేక ప్రాంతాల్లో వీధుల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోగా, పాత ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ముంపు నీటిలోనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారి ఇబ్బందులు మరింత తీవ్రంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తున్నప్పటికీ నీటిని పూర్తిస్థాయిలో తొలగించేందుకు చేపడుతున్న చర్యలు ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించలేకపోతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.

ప్రధాన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి

పెద్దమార్కెట్ ప్రాంగణం, కొత్తపేట ఓవర్‌బ్రిడ్జి అండర్‌పాస్, నూకాలమ్మ గుడి రోడ్డు, సినిమా రోడ్డు, గాంధీబొమ్మ జంక్షన్, జవహర్ వీధి, పాత మున్సిపల్ కార్యాలయ జంక్షన్, సంజయ్‌నగర్, ఓవర్‌బ్రిడ్జి మలుపు, ఘంటశాల విగ్రహం జంక్షన్, పాత బస్టాండ్ రోడ్డు, రైతుబజార్, ఆర్టీసీ కాంప్లెక్స్, బర్మా కాలనీ, అన్నమ్మఘాటీ రోడ్డు, కొండయ్యపాలెం, రామారావుపేట బ్రిడ్జి, సర్వీస్ రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, కచ్చేరిపేట తదితర ప్రాంతాల్లో ముంపు సమస్య కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

రోడ్లు ఎత్తయ్యాయి.. ఇళ్లు లోతయ్యాయి

ఏళ్లుగా ప్రధాన రహదారులపై వరుసగా రోడ్లు వేయడం వల్ల అనేక వీధులు, పాత ఇళ్లు రహదారుల కంటే తక్కువ ఎత్తులోకి వెళ్లిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. రహదారుల నిర్మాణంతోపాటు వాటికి అనుసంధానంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందని పేర్కొంటున్నారు.

ఉప్పుటేరు వెడల్పు తగ్గడమే ప్రధాన కారణమా?

కాకినాడలో ముంపు సమస్యకు ప్రధాన కారణాల్లో ఉప్పుటేరు వెడల్పు, లోతు తగ్గిపోవడం కూడా ఒకటని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు లాంటి మేధావులు ప్రజాసంఘాల నాయకులు చాలా సంవత్సరాలుగా పేర్కొంటున్నారు. ఇంద్రపాలెం లాకుల వద్ద అక్రమ మేడలైన్ వంతెన నుంచి బ్రహ్మంగారి మఠం మీదుగా ఏటిమొగ ఎర్ర రోడ్డు వరకు ఉప్పుటేరును వెడల్పు చేసి, లోతు పెంచి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. రేచర్లపేట మేజర్ రైల్వే డ్రైనేజీ నిర్వహణ కూడా సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

పైపై అభివృద్ధితో ప్రయోజనం ఉండదు

స్థానిక ఎన్నికల నేపథ్యంలో తారు రోడ్లకు ప్రాధాన్యం ఇస్తూ పైపై అభివృద్ధి పనులు చేపట్టడం కంటే, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండా కొత్త రోడ్లు వేయడం వల్ల భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

మెట్రో విజన్‌తోనే శాశ్వత పరిష్కారం

సుమారు 160 ఏళ్ల చరిత్ర కలిగిన కాకినాడ నగరం సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండటంతో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో ప్రత్యేక సాంకేతిక ప్రణాళిక అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి, ప్రధాన రహదారులతో పాటు పక్కా డ్రైనేజీలు, వీధి కల్వర్టులు, అనుసంధాన కాలువలను శాస్త్రీయంగా నిర్మించాలి. ఎత్తు–పల్లాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర మెట్రో విజన్ తో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తేనే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోరుతున్నారు.

కాకినాడ నగర పాలక సంస్థ బడ్జెట్‌లో ముంపు నివారణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, డ్రైనేజీలు, కల్వర్టులు, కాలువల నిర్మాణానికి గణనీయమైన నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్ల నిర్మాణానికి ముందే డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని సూచిస్తున్నారు.

వర్షం ఆగిన తర్వాత కూడా ఇళ్లలో నీరు నిలిచి ఉండటం, వీధుల్లో మురుగునీరు ప్రవహించడం కాకినాడ ప్రజల నిత్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు, ఆసుపత్రులు, నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు ముంపు నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా తాత్కాలిక నీటి తొలగింపుతో సరిపెట్టకుండా, కాకినాడకు శాశ్వత ముంపు నివారణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్