- డిఎస్‌పికి మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత వినతి
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : తమ ఇంటి పరిసరాలలో నిఘా ఉంచాలని వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల డిఎస్‌పి మురళీ నాయక్‌ను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కోరారు. తన తండ్రి హత్య కేసులో ఇడి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల నుంచి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున పులివెందుల పట్టణంలోని తన ఇంటి పరిసరాల్లో నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారణం పట్టణంలోని డిఎస్‌పి కార్యాలయానికి సునీత, రాజశేఖర్‌రెడ్డి వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ ఆధీనంలో ఉన్న భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని రిజిస్టర్ చేయించుకున్నారని పులివెందుల ఆర్‌డిఒకు గతంలో సునీత ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్‌డిఒ విచారణ జరిపి అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్న వారిపై కేసు నమోదు చేయాలని పులివెందుల పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌డిఒ ఉత్తర్వుల మేరకు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై నిందితులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కౌంటర్ దాఖలు చేయాలని పులివెందుల పోలీసులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి.
బెయిల్ మంజూరు కాకముందే నిందితులను అరెస్టు చేయాలని, వారు బయట ఉంటే రెవెన్యూ అధికారులను, ఆస్తికి సంబంధించిన పత్రాలను తారుమారు చేసే అవకాశం ఉందని డిఎస్‌పిని సునీత దంపతులు కోరారు. హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని గురువారం హైదరాబాద్‌లో ఇడి విచారించిన నేపథ్యంలో సునీత దంపతులు పులివెందులలో డిఎస్‌పిని కలవడం తాజాగా చర్చనీయాంశమైంది.








కామెంట్‌లు (0)