సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్దానాన్ని వణికిస్తున్న కిడ్నీ మహమ్మారి

5 గంటల క్రితం

kidney
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 03:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- తాజా అధ్యయనంలో 24.35 శాతం మందికి ఈ సమస్య

- మూలాలు తేలక, మందులు, పింఛన్లు అందక బాధితుల అవస్థలు

ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా), విశాఖపట్నం : ఉద్దానాన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న కిడ్నీ మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. వ్యాధి మూలాలను అన్వేషించేందుకు ఐసిఎంఆర్‌ ఆమోదంతో జరుగుతున్న సమగ్ర అధ్యయనంలో ఆందోళనకర ఫలితాలు వెలుగుచూశాయి. 5,851 మంది లక్ష్యంగా చేపట్టిన అధ్యయనంలో 3,897 మందిని పరీక్షించారు. వీరిలో 949 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అంటే పరీక్షించిన వారిలో 24.35 శాతం మంది బాధితులే. వీరిలో 550 మందికి క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సికెడి), మరో 399 మందికి కారణం స్పష్టంగా తెలియని సికెడియు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కవిటి మండలంలో అత్యధిక సికెడి కేసులు నమోదయ్యాయి. క్రియాటినిన్‌, యూరియా, యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరగడంతో పాటు కొందరిలో మూత్రంలో అల్బుమిన్‌ పెరుగుదలను అధ్యయన బృందం గుర్తించింది. వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రక్తం, మూత్రంతో పాటు భూమి, నీటి నమూనాలను సేకరిస్తున్నారు. పురుగుమందుల అవశేషాలు, భార లోహాలు, జన్యు, పర్యావరణ, వృత్తి సంబంధిత అంశాలనూ పరిశీలిస్తున్నారు.

లెక్కలకు మించిన విషాదం

​ 2024 లెక్కల ప్రకారం ఉద్దానంలోని ఏడు మండలాల్లో 23,086 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా, 538 మంది డయాలసిస్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. 2017లో ప్రారంభమైన గ్రామస్థాయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు కొన్నేళ్లకే నిలిచిపోవడంతో ప్రస్తుతం వాస్తవ బాధితుల సంఖ్య ఎంత అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యాధి బారిన చిన్నారులు, యువకులు, పెద్దలు కూడా పడుతున్నారు. ఇద్దివానిపాలెంకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి, తొత్తిడిపుట్టుగకు చెందిన 42 ఏళ్ల గోపాల్‌, ప్రగడపుట్టుగకు చెందిన ముగ్గురు ఆడపిల్లల తండ్రి సోమేష్‌ బిసాయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. తల్లిదండ్రులను, అన్నను కోల్పోయిన పొడియా కృష్ణారావు కూడా అదే వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు.

ఉచిత మందులు తగ్గాయి... భారం పెరిగింది

బాధితుల సంఖ్య పెరుగుతున్నా వారికి అందుతున్న ఉచిత మందులు తగ్గిపోతున్నాయి. గతంలో 12 రకాల మందులు అందించగా ప్రస్తుతం రెండు, మూడు రకాలకే పరిమితమయ్యాయని బాధితులు చెబుతున్నారు. డయాలసిస్‌, మందుల ఖర్చులతో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. క్రియాటినిన్‌ ఐదు పాయింట్లు దాటిన వారికి రూ.5 వేల పింఛను అందిస్తామని ప్రకటించినా అర్హులందరికీ అందడం లేదని బాధితులు వాపోతున్నారు. వైద్య పరీక్షలు, ధ్రువీకరణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో పేద రోగులకు మరింత భారం పడుతోంది.

పరిశోధనతో పాటు పరీక్షలు కావాలి

ఐసిఎంఆర్‌ అధ్యయనం వ్యాధి మూలాలను వెలికితీసే దిశగా కీలక అడుగు. తుది నివేదిక కోసం ఎదురుచూస్తూ బాధితుల ప్రాణాలను పణంగా పెట్టలేం. ఏడు మండలాల్లో నిరంతర గ్రామస్థాయి పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందించాలి. అర్హులైన ప్రతి డయాలసిస్‌ రోగికి పింఛను సకాలంలో మంజూరు చేయాలి.

భవిష్యత్తు అగమ్యగోచరం

​ నా భర్త పొడియా గోపాల్ (40) కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఎటువంటి వ్యసనాలు లేని నా భర్తకు అకస్మాత్తుగా ఈ వ్యాధి సోకింది. డయాలసిస్ కేంద్రానికి తీసుకుని వెళ్లడం నుంచి అన్ని పనులూ నేనే చూసుకున్నా. ఎవరు నాకు సాయం లేరు. డయాలసిస్ కూడా ఇచ్ఛాపురంలో అవకాశం ఇచ్చారు. ఒక్కొక్కసారి రాత్రి అయ్యేది. నలుగురు ఆడపిల్లలతో చాలా అవస్థలు పడుతున్నాను. ఇప్పుడు ఆయన చనిపోయి నెల రోజులు గడిచింది. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

-పొడియా జ్యోతి, కె.తొత్తిడిపుట్టుగ, కవిటి మండలం

రోగ నిర్ధారణ, చికిత్సలు సమర్థవంతంగా నిర్వహించాలి : ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక లేఖ

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిన పడి పలువురు మృతి చెందడం, బాధితులు పెరుగుతూ ఉండటం పట్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి, పరిశోధన కేంద్రం ద్వారా కిడ్నీ వ్యాధుల రోగ నిర్ధారణ, చికిత్సను సమర్థవంతంగా నిర్వహించడం వంటి తక్షణ చర్యల ద్వారా మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ లేఖ రాశారు. ఆ వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. కిడ్నీ వ్యాధి మరణాలపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి అందజేసిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. 2017-19 మధ్య 176 గ్రామాల్లో 1,01,593 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా 13,093 మందికి అంటే 12.88 శాతం మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించారని, 2019-26 మధ్య కాలంలో ఈ వ్యాధి కాస్తా 12.88 శాతం నుండి 24.35 శాతానికి పెరిగిందని తెలిపారు. వ్యాధి నివారణకు ఏ రకమైన చర్యలూ చేపట్టడం లేదని పై లెక్కలద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు. పలాసలో కిడ్నీ వ్యాధి రీసెర్చి సెంటర్‌ ఉన్నా అక్కడ తగినంతమంది సిబ్బంది లేరని తెలిపారు. గత ప్రభుత్వం 2019 సెప్టెంబరు మూడున జారీ చేసిన జిఒ 102, 87ల ఆధారంగా వైద్యుల పోస్టుల సంఖ్య మొత్తం 60 (41+19)గా పేర్కొన్నారని, కానీ, 20 మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారని వివరించారు. శాశ్వత నర్సులు ఎవరూ లేరన్నారు. రీసెర్చి పూర్తి స్థాయిలో నడవడం లేదని వివరించారు. 18 మంది టెక్నీషియన్లకుగాను పది మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. నెఫ్రో ప్లస్ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్వంలో నడుస్తోన్న డయాలసిస్ కేంద్రంలో పూర్తిగా అందుబాటులో ఉండే ప్రత్యేక నెఫ్రాలజిస్టు లేరన్నారు. ఇది 200 పడకల ఆసుపత్రి కాగా వంద మాత్రమే పడకలు ఉన్నాయని తెలిపారు. అందువల్లే ఈ కాలమంతా కిడ్నీ రోగుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జిఒల పూర్తి అమలుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను అధునాతన వైద్య సాంకేతికతతో నడపాలని, డయాలసిస్ యూనిట్ల సంఖ్య పెంచాలని, ఈ కేంద్రాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. వ్యాధికిగల కారణాలను నిర్ధారించే లోతైన పరిశోధన కిడ్నీ రీసెర్చి సెంటరులో అంతర్జాతీయ నిపుణుల సహకారంతో జరపాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమాలను విస్తృతం చేయాలని, రోగులకు 22 రకాల ఉచిత మందులు, నెలవారీ పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ప్రతి పంచాయతీ పరిధిలో ప్రాథమిక చికిత్స కోసం డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మందస పిహెచ్‌‌సిని సిహెచ్‌‌సిగా అప్ గ్రేడ్ చేసి సౌకర్యాలు కల్పించాలని, అన్ని ఆరోగ్య కేంద్రాలలో మందులు ఉండేలా, అన్నిరకాల రక్త పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఈ లేఖలో సిఎంను అజశర్మ కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్