- ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : అత్యంత ప్రమాదకరమైన కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఎన్‌జిఒ హోంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ రాష్ట్రం మితివిర్దిలో ఏర్పాటు చేయాల్సిన అణువిద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకించారని, దీంతో బిజెపి ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడకు తరలించిందని వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు చేపట్టిన భూ సేకరణతో కొవ్వాడ, కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాల్లో వేలాది మంది నిర్వాసితులు అయ్యారని తెలిపారు. రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అదాని కోసం కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి, బీచ్ శాండ్ తవ్వకాలకు ప్రభుత్వాలు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో మత్సకారులకు ఉపాధి కల్పించడానికి ఒక్క జెట్టీ కాని, ఫిషింగ్ హార్బర్ కాని కట్టలేదని గుర్తుచేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గాలి మాటలు తప్ప శ్రీకాకుళం జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కార్గో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ సీనియర్ నాయకులు చాపర సుందరలాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని పదేళ్లు అవుతున్నా స్థానిక ప్రజలకు పునరావాసం, పరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో విశ్రాంత ప్రొఫెసర్ జి అప్పలనాయుడు, ఇంటలెక్చువల్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు గోలివి అప్పలనాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, మత్సకారుల సంఘం నాయుకులు చింతపల్లి సూర్యనారాయణ, కొమర మున్నా,_కొవ్వాడ గ్రామస్తులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)