శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సాగునీరు ఇవ్వాల్సిందే

11 ఆగస్టు, 2026

farmer protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఏలూరు - కైకలూరు రోడ్డును దిగ్బంధించిన కృష్ణా డెల్టా రైతులు

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతులు మాదేపల్లి వద్ద ఏలూరు - కైకలూరు రోడ్డును మంగళవారం దిగ్బంధించారు. వరి నారుమళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎండిన వరి నారును ప్రదర్శిస్తూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. సాగునీరిచ్చి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరిచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున నీరు వస్తోందని, ఈ నీటిని కృష్ణా డెల్టా సాగుకు ఇస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. అయినా, కెఇ కెనాల్‌కు ఇంకా సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఏలూరు రూరల్ మండలంలోని పది వేల ఎకరాల కృష్ణా ఆయకట్టుకు పోణంగి పుంత కాలువ ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. ఈ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నీటిని దాదాపు 20 టిఎంసిలు కృష్ణాకు మళ్లించినా కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలకు నీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరందించి రైతాంగాన్ని ఆదుకోని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుంకర వారి తోట తదితర గ్రామాల రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్