మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతి రైల్వేలైన్‌ కోసం భూ సమీకరణ

2 గంటల క్రితం

amaravati railway line
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రైల్వేలైన్‌ ఏర్పాటులో భాగంగా వడ్డమాను గ్రామంలో మూడోదశ పూలింగుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకూ రెండుదశల్లో చేపట్టిన సమీకరణ మూడోదశకూ విస్తరించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్లో ఈమేరకు ఆమోదం తెలిపారు. పట్టణాభివృద్దిశాఖకు సంబంధించి పలు అంశాలపై క్యాబినెట్లో చర్చించారు. అమరావతి మీదుగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నంబూరు మధ్య నిర్మించనున్న కొత్త బ్రాడ్‌‌గేజ్‌ రైల్వే లైనుకు భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైనుకు ఇరువైపులా 50 మీటర్ల చొప్పున మొత్తం 100 మీటర్ల బఫర్‌ ‌జోన్‌‌తో పాటు ఇంటర్నల్‌ రింగ్ రోడ్డు నిర్మాణానికి తాడికొండ మండలం మోతడక గ్రామంలో మొత్తం 2344.12 ఎకరాల భూమిని గ్రామ సభ తీర్మానం మేరకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సేకరించేంందుకు సిఆర్డిఏ నిర్ణయించింది. మోతడక రైతులు తమ భూములు పూలింగుకు ఇస్తామని పేర్కొన్నారని, అందువల్ల సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా సమీకరణ ప్రకియకు నోటిపికేషన్‌ ఇచ్చే అధికారాన్ని సిఆర్డిఏ కమిషనర్‌‌కు ఇస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతోపాటు తాడికొండ, కంతేరులోనూ భూ సమీకరణ చేయాల్సి ఉంటుంది. అయితే మోతడకలో మూడోదశ భూ సమీకరణ ప్రక్రియ చేపట్టానున్నారని ప్రజాశక్తి ముందే వెల్లడించింది.

ఈనాం భూములకు ప్యాకేజీ

రెండోదశలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాల్లో సుమారు 1100 ఎకరాల వరకూ దేవాదాయ భూమి ఉంది. ఇందులో 340 ఎకరాల వరకూ దేవస్థానం కింద ఉండగా మిగిలినది ఈనాం కింద ఉంది. వీటిల్లో 1958లోనే పట్టాదారు హక్కులు పొందిన రైతులున్నారు. పూలింగు ఆలస్యంగా జరుగుతుండటంపై జరిగిన చర్చలో ఈనాం భూముల అంశం ముందుకు వచ్చింది. దీంతో నాలుగు గ్రామాల్లో ఈనాం భూములకు ఎల్‌‌పిఎస్‌ ‌ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. వడ్డమానులో 70 ఎకరాలు, హరిశ్చంద్రాపురంలో 260 ఎకరాలు, వైకుంఠపురంలో సుమారు 400 ఎకరాలు, పెదపరిమిలో 100 ఎకరాల వరకూ ఈనాం భూములున్నాయి. మరికొంత భూమి వివాదాస్పద లెక్కల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈనాం భూములకు పరిహారం ఇస్తే రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తారని సిఆర్‌‌డిఏ అంచనా వేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్